మాయా సరోవరం!

ప్రపంచంలోని స‌ర‌స్సుల్లో లోతైంది...అంతేనా ? అతిపెద్ద మంచినీటి స‌ర‌స్సుల్లో ఒకటి ... అంతేనా? ఇంకా దాని గొప్పలు చాలానే ఉన్నాయి... అదే లేక్ బైకాల్... ఇంతకీ దాని సంగతులేంటి?ఎత్తయిన పర్వతాలు, కొండల మధ్య ఇంచుమించు 636 కిలోమీటర్ల పొడవు, 20 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుందిది...

Published : 25 May 2019 00:18 IST

ప్రపంచంలోని స‌ర‌స్సుల్లో లోతైంది...అంతేనా ? అతిపెద్ద మంచినీటి స‌ర‌స్సుల్లో ఒకటి ... అంతేనా? ఇంకా దాని గొప్పలు చాలానే ఉన్నాయి... అదే లేక్ బైకాల్... ఇంతకీ దాని సంగతులేంటి?

ఎంతో పెద్దదో

* ఎత్తయిన పర్వతాలు, కొండల మధ్య ఇంచుమించు 636 కిలోమీటర్ల పొడవు, 20 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుందిది. ప్రపంచంలో లోతైన సరస్సు ఇదే. దాదాపు 5,387 అడుగుల లోతు ఉంటుంది. అంతేకాదూ... ప్రపంచంలో గడ్డ కట్టని మంచినీటిలో 20 శాతం నీరు ఈ సరస్సులోనే ఉంటుంది.
* ఈ సరస్సు తీర ప్రాంతం పొడవు 2,100 కిలోమీటర్లు.
* బైకాల్‌ సరస్సులో ఇంచుమించు 30 వరకూ దీవులు ఉంటాయి. వీటిల్లో ఒకటి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరస్సు దీవి. ఈ సరస్సులోని ఒల్కహాన్‌ అనే దీవిలో ఊళ్లు కూడా ఉంటాయి. అందులో 1500 జనాభా ఉంటుంది.

ఎక్కడుంది?

ఈ బైకాల్‌ సరస్సు రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. చంద్రవంక ఆకారంలో ఉండే ఈ అందమైన సరస్సును పర్ల్‌ ఆఫ్‌ రష్యా అని పిలుస్తారు.

ఎలా ఏర్పడింది?

పురాతనమైన సరస్సుల్లో ఇదీ ఉంది. ఎప్పుడో ఇంచుమించు 25 మిలియన్‌ ఏళ్ల క్రితమే ఏర్పడిందట. ఎత్తయిన నేలల మధ్యనో, పర్వత శ్రేణుల మధ్యనో భౌగోళిక మార్పుల ఫలితంగా లోతైన ప్రదేశం ఏర్పడినప్పుడు దాన్ని ‘రిఫ్ట్‌ వ్యాలీ’ అంటారు. ఈ రకంగానే ప్రాచీన కాలంలోనే ఈ బైకాల్‌ సరస్సు ఏర్పడింది.

ఇది క్లియర్

* ఈ సరస్సులోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే దీనికి ‘క్లియరెస్ట్‌ లేక్‌’గా పేరు. పై నుంచి చూస్తే 130 అడుగుల లోతువరకూ భలేగా పారదర్శకంగా కనిపిస్తాయి.
* ఈ సరస్సు మీదుగా ఇంచుమించు 300కి పైగా ప్రవాహాలు, నదులు ప్రవహిస్తుంటాయి. ఈ సరస్సు లోతుల్లోనూ ఆక్సిజన్‌ శాతం ఎక్కువేనట. అందుకే అప్పట్లో రకరకాల రోగాల్ని తగ్గించుకోవడానికి ఈ నీటిలో స్నానాలు చేసేవారు.

మొక్కలూ జీవులూ!

* ఇది జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. ఇందులో మంచినీటి సీళ్లు, రకరకాల చేపలు వంటివి దాదాపు 2,500 జీవజాతులుంటాయి. ఈ జీవుల్లో చాలా వరకు ఒముల్‌ ఫిష్‌, బైౖకాల్‌ ఆయిల్‌ ఫిష్‌, నెర్పా వంటివి ఇక్కడ మాత్రమే ఉంటాయ్‌. వెయ్యి రకాల మొక్కల జాతులున్నాయి.
* సుమారు 236 జాతుల పక్షులు ఈ సరస్సు పరిసరాల్లో బతుకుతుంటాయి.

మెరిసిపోతుంది!

* చలికాలంలో ఈ సరస్సు దాదాపు గడ్డకట్టుకుపోతుంది. ఆ సమయంలో అద్భుతమైన ఫినామినా ఏర్పడుతుంది. మంచు గడ్డలే తళతళ మెరుస్తూ కనిపిస్తుంటాయి. దీన్ని చూడ్డానికి, దానిపై నడుస్తూ స్కేటింగ్‌ వంటి ఆటలు ఆడుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు
వస్తుంటారు.
* ఏటా ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య 5 లక్షలకుపైనే.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని