చరిత్ర చెబుతాయ్‌ శిలాజాలు!

మానవుడు పుట్టక ముందే భూమిపై సంచరించాయి రాకాసి బల్లులు (డైనోసార్లు). వాటి గురించీ, మరెన్నో పూర్వకాలపు జీవుల గురించీ మనకు ఎలా తెలిసింది? దానికి సమాధానమే ‘శిలాజాలు’. ఆ  కబుర్లను చక్కటి బొమ్మలతో కళ్లకు కట్టినట్టు చెప్పే ఓ పుస్తకం గురించి తెలుసుకుందాం.భూమిపై మొదటి నుంచీ మనిషి లేడు.

Published : 04 Jun 2019 00:20 IST

 

మానవుడు పుట్టక ముందే భూమిపై సంచరించాయి రాకాసి బల్లులు (డైనోసార్లు). వాటి గురించీ, మరెన్నో పూర్వకాలపు జీవుల గురించీ మనకు ఎలా తెలిసింది? దానికి సమాధానమే ‘శిలాజాలు’. ఆ  కబుర్లను చక్కటి బొమ్మలతో కళ్లకు కట్టినట్టు చెప్పే ఓ పుస్తకం గురించి తెలుసుకుందాం.

భూమిపై మొదటి నుంచీ మనిషి లేడు. మనకంటే వందల వేల సంవత్సరాలకు ముందే చిన్నవీ, పెద్దవీ, అతి పెద్దవీ ఎన్నో జీవులు ఈ నేలపై సంచరించాయి.   కాలక్రమంలో కొన్ని అంతరించిపోయాయి. లక్షల, కోట్ల సంవత్సరాల క్రితం బతికిన, మనం ఎప్పుడూ చూడని ఆ జీవుల ఆకారం, అవి తినే ఆహారం, ఇంకా ఎన్నో విశేషాలను మనం తెలుసుకోగలిగామంటే అది శిలాజాల (ఫాసిల్స్‌) వల్లనే సాధ్యమైంది.

ఏదైనా ప్రాణి సహజంగానో, ప్రకృతి విపత్తు వల్లనో మరణించినపుడు అది భూగర్భంలో కూరుకుపోతే, కాలక్రమంలో దానిపై పేరుకున్న పదార్థాలపై ఆ ప్రాణి తన గుర్తును ఏర్పరుస్తుంది. అలా ఏర్పడిన శిలలు లేదా చిహ్నాలను శిలాజాలు అంటారు. భూకంపాల్లోనో, తవ్వకాల్లోనో ఇవి బయట పడుతుంటాయి. శిలాజాలు మనకు గతం గురించి చెబుతాయి. ఇప్పుడు నదులున్న చోట ఒకప్పుడు ఘన అడవులు ఉండేవి. ప్రస్తుతం బాగా చలిగా ఉండే ప్రాంతాలు ఒకప్పుడు వెచ్చగా ఉండేవి. ఎలా తెలిసిందిది? ఉష్ణ ప్రదేశాల్లో ఉండే చెట్ల శిలాజాలు ఇప్పటి చలి ప్రదేశాల్లో దొరకటం వల్ల.

చేప, దాని పొట్టలో మరో చేప
ఈ పుస్తకంలోని కొన్ని కబుర్లు...

చాలా కాలం క్రితం నాటి సంగతి. ఒక పెద్ద చేప చెరువులో ఈదుతూ ఉంది. దాని దగ్గరకు ఒక చిన్న చేప వచ్చింది. పెద్ద చేప చాలా ఆకలి మీద ఉండి, చిన్న చేపను అమాంతం మింగేసింది. కొంచెం సేపటికి పెద్ద చేప చచ్చిపోయింది, ఆ చెరువు అడుగుకి చేరింది. 

ఇది 9 కోట్ల సంవత్సరాల క్రితం జరిగింది. మనకి ఇది ఎలా తెలిసింది? ఎలాగంటే, ఆ చేప రాయిగా మారింది. చెట్టు కానీ, ఏదైనా ప్రాణి కానీ రాయిగా మారితే దాన్ని శిలాజం అంటాం. ఏ రాయి ఎంత పురాతనమైనదో శాస్త్రజ్ఞులు చెప్పగలుగుతారు. అందుకే చేప శిలాజం ఏనాటిదో తేలికగా చెప్పగలిగారు. 

చనిపోయిన తర్వాత ఆ చేప చెరువు మట్టిలో కూరుకుపోయింది. మెల్లగా కుళ్లిపోవటం మొదలయ్యింది. చివరికి దాని ఎముకలు మాత్రం మిగిలాయి. పెద్ద చేప మింగిన చిన్న చేపవి కూడా ఎముకలు మాత్రమే మిగిలాయి. చేప అస్థిపంజరం మట్టిలో కూరుకుని సురక్షితంగా ఉండిపోయింది. 

వేలాది సంవత్సరాలు గడిచాయి. చేప మీద మరిన్ని మట్టి పొరలు పేరుకున్నాయి.. క్రమేపీ టన్నుల కొద్దీ మట్టి పేరుకుపోయింది. చాలా కాలానికి భూమి రూపురేఖలు కూడా 
మారిపోయాయి. చేప ఉన్న చెరువు ఎండిపోయింది. 

ఎండిన మట్టి మీద వాన కురిసింది. వాన నీళ్లు మట్టిలోకి ఇంకాయి. ఆ నీళ్లలో రాళ్లలోని ఖనిజాలు ఉన్నాయి. చేప ఎముకల్లోని సన్నని రంధ్రాల్లోకి ఈ నీళ్లు చేరాయి. నీటిలోని ఖనిజాలు చేప ఎముకల్లో ఉండిపోయాయి. చాలా కాలానికి ఎముకలను ఖనిజాలు రాయిగా మార్చేశాయి. 

ఇప్పుడు చేప ‘శిలాజం’గా మారిపోయిందన్నమాట. దాని చుట్టూ ఉన్న మట్టి కూడా రాయిలాగా గట్టిగా అయిపోయింది!

ఈ విశేషాలన్నీ ఉన్న ఈ పుస్తకాన్ని ఇంటర్నెట్లో ఆర్కైవ్స్‌ అనే వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుకోవచ్చు. 

https://archive.org/details/FossilsTellOf LongAgo-Telugu

ఇదంతా చదివాక... శిలాజం ఎలా ఉంటుందో చూడాలని ఉందా? శిలాజంగా  మారిన చెట్టు కాండం మన  హైదరాబాద్‌లోని  నెహ్రూ జూలాజికల్‌ పార్కులో ఉంది. ఈసారి ఎప్పుడైనా అక్కడికి వెళ్తే దాన్ని చూడటం మర్చిపోకండి. 

బొమ్మల పుస్తకం...

శిలాజాల విశేషాలను ఆసక్తికరంగా తెలిపే పుస్తకం- ‘ఫాసిల్స్‌ టెల్‌ ఆఫ్‌ లాంగ్‌ ఎగో’. దీన్ని రాసిందెవరంటే.. అలీకీ అనే అమెరికన్‌ రచయిత్రి. బొమ్మలనూ ఆమే వేశారు. తమిళంలో ఉన్న ఈ రచనను ‘ఎంతోకాలం క్రితం సంగతులు శిలాజాలు చెబుతాయి’ అనే పేరుతో  తెలుగులోకి అనువదించినవారు కె.సురేష్‌.

ఎందుకు చదవాలి?

భూమిపై చాలా జీవజాతులు పురాతన కాలానికీ, ఇప్పటికీ ఎంతో మార్పు చెందాయి. జీవ పరిణామం దీనికి కారణం. మరి వాటి పురాతన రూపం, పరిణామంలో వచ్చిన మార్పులు తెలియాలంటే.. శిలాజాలే ఆధారం. నాటి జీవుల చరిత్రకు ఇవి చెక్కుచెదరని  సాక్ష్యాలు. తరతరాల ప్రాణుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా ప్రకృతి పదిలంగా భద్రపరిచిన అద్భుతాలివి. ఇలాంటి పాపులర్‌ సైన్స్‌ పుస్తకాలు చదివితే శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెరుగుతుంది. జీవశాస్త్రంపై, పర్యావరణంపై కొంత అవగాహన పెరుగుతుంది. అభిరుచి ఉన్న అంశాలపై ఉన్నతస్థాయి పరిజ్ఞానం ఏర్పరుచుకోవటానికి పునాది ఏర్పడుతుంది.
- సీహెచ్‌. వేణు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని