జిమ్మిక్కుల మేజిక్కు!

‘అబ్రకదబ్ర... అబ్రకదబ్ర’... ఇదిగోండి క్షణంలో మాయం... అంటూ మేజిక్‌ చేస్తుంటే భలేగా ఉంటుంది కదూ... ఈరోజు సరదాగా మనమూ మేజిక్‌ చేసి స్నేహితుల్ని ఆశ్చర్యపరుద్దామా?ఎందుకంటే ఇవాళ మేజిక్‌ డే!

Published : 12 Jun 2019 07:38 IST

‘అబ్రకదబ్ర... అబ్రకదబ్ర’... ఇదిగోండి క్షణంలో మాయం... అంటూ మేజిక్‌ చేస్తుంటే భలేగా ఉంటుంది కదూ... ఈరోజు సరదాగా మనమూ మేజిక్‌ చేసి స్నేహితుల్ని ఆశ్చర్యపరుద్దామా?ఎందుకంటే ఇవాళ మేజిక్‌ డే!

మేజిక్‌లో కొన్ని వేల ట్రిక్‌లు ఉంటాయి. రహస్యం చెబితే చాలు చేయగలిగేవి కొన్ని. ప్రాక్టీసు ద్వారా సాధించేవి మరికొన్ని. ప్రేక్షకుల ఇంద్రియాలను మాయ చేసే కళ ఇది. దీంట్లో వస్తువుల్ని సృష్టించడం, మాయ చేయటం, రూపం మార్చటం, ఇక్కడ అదృశ్యం చేసి అక్కడ ప్రత్యక్షం చేయడం ఇలా చాలా రకాలుంటాయి.  
దీన్నే ఇల్యూజన్‌, స్టేజ్‌ మేజిక్‌, క్లోజప్‌ మేజిక్‌ అని పిలుస్తారు. 
చాలా దేశాల్లో దీనికి క్లబ్బులు, నేర్పించే సంస్థలు ఉన్నాయి. ఏటా మెజీషియన్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలూ జరుగుతాయి.  
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్‌ సైన్యం ఓ మెజీషియన్‌ను తీసుకొచ్చి ఆఫ్రికా సైన్యాన్ని బోల్తా కొట్టించిందట. 
చైనాలోని ఓ థీమ్‌ పార్కులో రోజూ  ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తుంటారు. గడ్డకట్టే చలి ఉన్నా అసలు ప్రేక్షకులు ఎవరూ రాకపోయినా ఇది కొనసాగుతూనే ఉంటుంది. 
మేజిక్‌ అనేది గ్రీకు పదం. మొదటి ఇంద్రజాలికులుగా గ్రీకులు, పర్షియన్లను చెబుతారు. 
18వ శతాబ్దంలో ఈ కళ బాగా ప్రసిద్ధి చెందింది. కొన్ని మేజిక్‌లు, దాని కిటుకులూ తెలుసుకుని స్నేహితుల ముందు ప్రదర్శిద్దాం. ఫొటోల సాయంతో చూసి నేర్చుకుందాం. 

గాల్లో స్ట్రా!

కావాల్సినవి: ఒక స్ట్రా, ప్లాస్టర్‌

మేజిక్‌:  పై ఫొటోలో చూపించినట్లు చేతులకు తగలకుండా అటూ ఇటూ గాల్లో స్ట్రాను కదిపేయొచ్చు. అలా ఎంతసేపైనా చేస్తుంటే చూసినవారంతా ఇదెలా అనుకుంటారు.

కిటుకు: మరేం లేదు ఒక చేయి మధ్యవేలికి చిన్న ప్లాస్టర్‌తో ఆ స్ట్రాని అతికించుకోవాలి. లోపలి వైపునకు ఉంచుకున్న ఆ వేలిని ఆడిస్తుంటే స్ట్రా గాల్లో కదులుతున్నట్టు ఉంటుందంతే.

బాటిల్‌లో కాయిన్‌!

కావాల్సినవి: ప్లాస్టిక్‌ బాటిల్‌, నాణెం, చిన్న చాకు

మేజిక్‌: ఒక చేతిలో బాటిల్‌ మరో చేతిలో నాణెం పట్టుకుని అందరికీ చూపిస్తూ నాణేన్ని బాటిల్‌ మూత తీయకుండా వేసేయొచ్చు. అందర్నీ అవాక్కయ్యేలా చేయొచ్చు.

కిటుకు: ముందుగానే బాటిల్‌కి ఓ పక్కన చిన్న చాకుతో కత్తిరించుకుంటే సరి. రెప్పపాటులో అందులో నుంచి నాణేన్ని పంపొచ్చు.

మిగిలేది ఐదే! 

ఒక అంకెను ఊహించుకోండి.దాన్ని రెట్టింపు చెయ్యండి. దానికి పది కలపండి. దాన్ని సగం చెయ్యండి. ఆ వచ్చిన మొత్తం నుంచి మొదట ఊహించుకున్న అంకెను తీసేయండి. మీ దగ్గర 5 మిగిలింది కదూ!

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని