టమాటా పుట్టిందిక్కడే!

ఏంటివి?ఆండిస్‌ పర్వతాలు.వీటి గొప్పేంటో?ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి ఇదే. అంటే ఇక్కడ పర్వతాలు గొలుసుకట్టుగా చాలా పొడుగుంటాయన్నమాట.ఎంత పొడవు?ఏడు వేల కిలో మీటర్లు. వెడల్పులో అయితే 200 నుంచి 700 కిలోమీటర్ల మేర ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి.ఎన్ని దేశాల్లో?మొత్తం ఏడు దేశాల్లో, దక్షిణ అమెరికా ఖండమంతా విస్తరించి ఉన్నాయివి. ఆ దేశాలు ఏంటంటే వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, బొలీవియా, చిలీ, అర్జెంటీనా...

Published : 29 Jun 2019 00:28 IST

ఏంటివి?

ఆండిస్‌ పర్వతాలు.

వీటి గొప్పేంటో?
ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి ఇదే. అంటే ఇక్కడ పర్వతాలు గొలుసుకట్టుగా చాలా పొడుగుంటాయన్నమాట.

ఎంత పొడవు?
ఏడు వేల కిలో మీటర్లు. వెడల్పులో అయితే 200 నుంచి 700 కిలోమీటర్ల మేర ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి.

ఎన్ని దేశాల్లో?
మొత్తం ఏడు దేశాల్లో, దక్షిణ అమెరికా ఖండమంతా విస్తరించి ఉన్నాయివి. ఆ దేశాలు ఏంటంటే వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, బొలీవియా, చిలీ, అర్జెంటీనా.

ఒకటే పేరా?

పేరు ఆండిస్‌ పర్వతాలేగానీ వీటిని మళ్లీ మూడు భాగాలుగా విడగొడతారు. దక్షిణ, మధ్య, ఉత్తర ఆండిస్‌లుగా పిలుస్తారు. అర్జెంటీనా, చిలీ దేశాల్లో ఉన్న పర్వతాల్ని దక్షిణ ఆండిస్‌గా పిలుస్తారు. ఇక రెండోవి పెరూ, బొలీవియాల్లో, మూడోవి వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్‌ల్లో ఉన్నవన్నమాట.

ఎప్పుడు ఏర్పడ్డాయి?
దక్షిణ అమెరికా, పసిఫిక్‌ టెక్టానిక్‌ ప్లేట్లు ఢీకొన్నప్పుడు 50 మిలియన్‌ ఏళ్ల క్రితం ఏర్పడ్డాయట.

ఎత్తయిన శిఖరాలున్నాయా?

ఇక్కడ అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్‌ అకోంకాగువా. అర్జెంటీనాలో ఉంది. ఈ శ్రేణుల్లో ఎత్తయిన శిఖరాలన్నీ దాదాపు అగ్నిపర్వతాలవే. చురుగ్గా ఉన్న అగ్ని పర్వతాల్లో ఎత్తయినది ఉన్నదిక్కడే. చిలీ, అర్జెంటీనా సరిహద్దుల్లో ఉన్న ఇది 6,900 మీటర్ల ఎత్తుంటుంది. ఇంకా ఇక్కడున్న 50కిపైగా శిఖరాలు 20 వేల అడుగుల కన్నా ఎత్తుంటాయి.

ఇంకా గొప్పవేమైనా?

టమాటాలు, బంగాళా దుంపలు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆహారంలో భాగమే. అవి పుట్టింది ఈ పర్వతాల్లోనే. ఇక్కడున్న లేక్‌ టిటికాకా ప్రపంచంలోనే అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న సరస్సు. దీని వల్ల ప్రపంచంలోనే అతి ఎత్తయిన చోట ఉప్పు మడులు ఇక్కడ ఏర్పడ్డాయి. ఇవి సముద్ర మట్టానికి 3,600 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.

జీవజాలం సంగతో?

భిన్న రకాల జీవ జాతులకిది ఆవాసం. 600రకాల క్షీరదాలు, అంతే సంఖ్యలో సరీసృపాలు, 400 చేప జాతులు, 1700 రకాల పక్షులు, వెయ్యికి పైగా ఉభయచర జీవజాతులు ఇక్కడున్నట్లు అంచనా. ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా 30వేలకు పైగా మొక్కల జాతులు పెరుగుతున్నాయట.

ఇంకేం ఉన్నాయి?

పెద్ద నదుల్లో ఒకటిగా చెప్పుకొనే అమెజాన్‌ నది పుట్టింది ఈ శ్రేణుల్లోనే. ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు గని ఉన్నది ఇందులోనే. ఎక్కడంటే పెరూలో. దాని పేరు యనకొచా గోల్డ్‌ మైన్‌. 13వేల టన్నుల బంగారం, 2లక్షల 50వేల టన్నుల వెండి ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యింది. చిలీ, పెరూలు ఈ పర్వతాల్లోంచే పెద్ద ఎత్తున రాగిని మైనింగ్‌ చేస్తున్నాయి. దాదాపుగా ప్రపంచ అవసరాల్లో 50 శాతం రాగి ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది.

పర్యటకం సంగతేంటి?

యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన మచుపిచ్చు ఈ శ్రేణుల్లోనే ఉంది. ఇంకా పర్వతారోహకులు, సాహసికుల్ని ఈ శిఖరాలు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. సైక్లింగ్‌, స్కీయింగ్‌..లాంటి ఆటలకూ ఈ పర్వతాలు ప్రసిద్ధి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని