ఇంద్ర ధనస్సుకు ఒక్కటే రంగు

ఇంద్రధనుస్సంటే ఏడు రంగులు... అదే మనందరికీ తెలుసు... మరి ఓ చిత్రమైన హరివల్లుంది... అది ఈ మధ్య ఒక్క వర్ణంతోనే కనిపించింది... దాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు... అలాంటి తమాషా విషయం మనం తెలుసుకోకపోతే ఎలా?

Updated : 24 Sep 2019 06:18 IST

ఇంద్రధనుస్సంటే ఏడు రంగులు... అదే మనందరికీ తెలుసు... మరి ఓ చిత్రమైన హరివల్లుంది... అది ఈ మధ్య ఒక్క వర్ణంతోనే కనిపించింది... దాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు... అలాంటి తమాషా విషయం మనం తెలుసుకోకపోతే ఎలా?
రెయిన్‌బో అంటే మనకు భలేగా ఇష్టం కదూ. ఏడు రంగులతో అది ఆకాశంలో కొలువుదీరిందంటే చూసేందుకు ఎంతో సరదా. మరేమో ఈ మధ్య స్కాట్లాండ్‌లో ఓ వింత ఇంద్రధనుస్సు దర్శనమిచ్చింది. అదే పింక్‌రెయిన్‌బో. గులాబీ రంగులో మాత్రమే ఇదుంది.
* ఆకాశంలో ఇలాంటి విల్లు కనిపించేసరికి అక్కడ అంతా కళ్లప్పగించి చూశారు. ఇదేంటీ ఇలా ఒక్క రంగులో ఎలా వస్తుంది? అనుకుంటూనే క్లిక్‌ క్లిక్‌లు మొదలు పెట్టేశారు. దీంతో ఈ వార్త అంతర్జాలంలోనూ వైరల్‌ అయిపోయింది.
* తీరా అసలిదేంటబ్బా అని ఆరా తీస్తే... అప్పుడు తెలిసింది అసలు విషయం. వాతావరణంలో ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపించే విశేషం.
* మామూలుగా ఏడు రంగుల ఇంద్రధనుస్సు ఎందుకొస్తుంది? సూర్యుడి నుంచి వచ్చే తెల్లటి కాంతి వాతావరణంలోని నీటి బిందువులను చేరుతుంది. అప్పుడది వక్రీభవనం, పరావర్తనం చెందుతుంది. తెల్లటి కాంతి ఏడు రంగులుగా విడిపోయి ఆకాశంలో
ఇంద్రధనుస్సుగా ఏర్పడుతుంది. దీంట్లో ఒక చివర ఎరుపు రంగు ఉంటుంది. ఈ ఎరుపు రంగు మాత్రమే వక్రీభవనం, పరావర్తనం చెందడం వల్ల ఈ పింక్‌ రెయిన్‌బో ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎక్కువగా సూర్యోదయ సూర్యాస్తమయ
సమయాల్లోనే వచ్చేందుకు అవకాశాలున్నాయట.  

* ఇలా ఒకే రంగు ఇంద్రధనుస్సు ఇదొక్కటే కాదు. అప్పుడప్పుడూ తెల్లటిది, ఎర్రటిది కూడా ఏర్పడిన సందర్భాలున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని