ఎత్తయిన రికార్డు ఎక్కేసింది!

ఎవరీ చిన్నారి?పేరు కామ్యా కార్తికేయన్‌. వయసు పన్నెండేళ్లు. ఉండేది ముంబయిలో.మరి మన పేజీలోకి ఎందుకొచ్చింది?చిన్న వయసులోనే ఎన్నో ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

Published : 27 Feb 2020 00:08 IST

ఎవరీ చిన్నారి?

పేరు కామ్యా కార్తికేయన్‌. వయసు పన్నెండేళ్లు. ఉండేది ముంబయిలో.

మరి మన పేజీలోకి ఎందుకొచ్చింది?

చిన్న వయసులోనే ఎన్నో ఎత్తయిన పర్వతాలను అధిరోహిస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

ఇలా చాలామంది చిన్నారులు ప్రయత్నిస్తుంటారుగా!?

దక్షిణ అమెరికాలోని ఎత్తయిన పర్వతం అకోంకాగువా. ఎత్తు 6,962 మీటర్లు. ఎప్పుడూ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి. వణుకు తెప్పించే చలిలో తండ్రితో కలిసి తొమ్మిది రోజులు నడిచింది కామ్యా. క్యాంప్‌ 2 వరకు చేరింది. ఆ చలికి తట్టుకోలేదని అధికారులు ఆ అమ్మాయిని వెనక్కి పంపారు. అయినా పట్టుపట్టి మళ్లీ తన సాహస యాత్ర ప్రారంభించింది. ఈమధ్యే తన లక్ష్యం చేరుకుంది. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు కొట్టింది.

అవునా? ఇంతకీ ఈ చిన్నారికీ ఆసక్తి ఎలా వచ్చింది?

కామ్యా తండ్రి కార్తికేయన్‌కు ఎత్తయిన కొండలు, పర్వతాలు అధిరోహించడం అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే తన కూతురికి హిమాలయాలు, ఇతర పర్వతాల గురించి ఎప్పుడూ కథలు కథలుగా చెప్పేవాడు. అవి వింటూ పెరిగిన ఈ చిన్నారికీ పర్వతాలు ఎక్కడమంటే ఇష్టం పెరిగింది. ఇంట్లోవాళ్ల సాయంతో మూడేళ్ల వయసులోనే కామ్యా లోనావాలా సహ్యాద్రి కొండను చకచకా ఎక్కేసింది. సెలవులు వస్తే చాలు... నాన్నతో కలిసి సాధన చేసేది. తొమ్మిదేళ్లు వచ్చేసరికి హిమాలయాల్లోని ఎన్నో శిఖరాలు అలవోకగా ఎక్కేసింది. పదేళ్లకే ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను అధిరోహించింది. లద్దాఖ్‌లోని స్టోక్‌ కాంగ్డి పర్వత శిఖరానికి చేరిన అతిచిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.

గ్రేటే... చిన్న వయసులోనే ఇదెలా సాధ్యమైంది?

పర్వతాలు ఎక్కడమంటే అంత సులువేం కాదు. దీనికోసం ఈ చిన్నారి రోజూ సాధన చేస్తుంటుంది. పదిహేను అంతస్తుల భవనాన్ని ఆరు కిలోల బరువుతో ఎక్కి దిగడం.. ఎన్నో కిలోమీటర్లు నడవడం... మరెన్నో కిలోమీటర్లు సైక్లింగ్‌ చేయడం లాంటివి చేసేస్తుంది.

మరి చదువో?

నేవీ చిల్డ్రన్‌ స్కూల్లో ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న కామ్యా మంచి మార్కులే తెచ్చుకుంటోంది. భరత నాట్యం, కర్ణాటక సంగీతం, పియానో నేర్చుకుంటోంది.

ప్రధాని ప్రశంస...

కామ్యా సాహసం, విజయం ఎందరికో ప్రేరణగా నిలుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్‌’లో మెచ్చుకున్నారు. ఆమె గెలుపులో ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాముఖ్యముందంటూ కామ్యాకు అభినందనలు చెప్పారు.

- కట్టంగూర్‌ మల్లేష్‌ గౌడ్‌, న్యూస్‌టుడే, ముంబయి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని