రికార్డులను ‘ఈదేసింది’!

మనం ఆపకుండా అరగంట నడిచినా, పరుగెత్తినా అలసిపోతాం.. నీటిని చూస్తే భయపడిపోతాం.. కానీ, ఆటిజం(బుద్ధి మాంధ్యం)తో బాధపడే ఓ బాలిక ఈతలో రికార్డులు కొల్లగొట్టేస్తోంది. అందరితో శెభాష్‌ అని అనిపించుకుంటోంది. ఆ విశేషాలు తెలుసుకుందాం..!!

Published : 26 Feb 2021 01:42 IST

మనం ఆపకుండా అరగంట నడిచినా, పరుగెత్తినా అలసిపోతాం.. నీటిని చూస్తే భయపడిపోతాం.. కానీ, ఆటిజం(బుద్ధి మాంధ్యం)తో బాధపడే ఓ బాలిక ఈతలో రికార్డులు కొల్లగొట్టేస్తోంది. అందరితో శెభాష్‌ అని అనిపించుకుంటోంది. ఆ విశేషాలు తెలుసుకుందాం..!!

ముంబయికి చెందిన జియారాయ్‌కు పన్నెండేళ్లు. తాను అందరిలా మాట్లాడలేదు.. చెప్పిన విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. అలాంటి అమ్మాయి ఇటీవల బాంద్రా వర్లీ సీ లింక్‌ నుంచి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వరకూ అంటే 36 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 40 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించింది. తెల్లవారుజామున 3.50 గంటలకు ఈత ప్రారంభించిన జియా.. మధ్యాహ్నం 12.30 గంటలకు గమ్యం చేరుకుంది. గతేడాది 14 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల 27 నిమిషాల్లో ఈదిన దివ్యాంగ చిన్నారిగా రికార్డు సాధించింది. తాజా ఘనతతో తన రికార్డును తానే బద్దలుగొట్టినట్లయింది. ఆటిజంపై అవగాహన కల్పించేందుకు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.

* తండ్రి ప్రోత్సాహంతో..
ఒకసారి జియాను వాళ్ల నాన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆమె చిన్నతనంలోనే ఈత నేర్చుకోవడం ప్రారంభించింది. అలా క్రమక్రమంగా తండ్రి ప్రోత్సాహంతో ఏడాదిలోనే బోలెడు మెలకువలు నేర్చేసుకుందట. పలు పోటీల్లో పాల్గొని పతకాలు కూడా సాధించింది. అలా వైద్యుల సలహా మేరకు మొదలు పెట్టిన ఈత.. ప్రస్తుతం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. త్వరలో బెంగళూరులో జరగనున్న జాతీయ పోటీల్లో, టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపేందుకు జియారాయ్‌ సన్నద్ధమవుతోంది. తాను అక్కడా విజయం సాధించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని