అక్కడ అంతా అరటిమయం!

నేస్తాలూ.. బాగున్నారా..! నేను మీ చిన్నూను. మనకు అరటి పండంటే భలే ఇష్టం కదూ! చిటికెలో తినేస్తే క్షణంలో మనకు శక్తిని అందిస్తుంది. అలాంటి అరటిలో చాలా రకాలున్నాయని తెలుసా?! అంతెందుకు మన దేశంలో వీటిలో సుమారు 50కు పైగా రకాలున్నాయి.

Published : 23 Mar 2021 01:47 IST

నేస్తాలూ.. బాగున్నారా..! నేను మీ చిన్నూను. మనకు అరటి పండంటే భలే ఇష్టం కదూ! చిటికెలో తినేస్తే క్షణంలో మనకు శక్తిని అందిస్తుంది. అలాంటి అరటిలో చాలా రకాలున్నాయని తెలుసా?! అంతెందుకు మన దేశంలో వీటిలో సుమారు 50కు పైగా రకాలున్నాయి. ‘అది సరే.. చిన్ను ఏంటి.. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ అరటి సంగతులు చెబుతున్నాడేంటి?’ అని ఆలోచిస్తున్నారా..! చెప్తా.. చెప్తా.. అక్కడికే వస్తున్నా..! ఓ తాతయ్య ఏకంగా కొన్ని వేల అరటి పండ్ల బొమ్మలతో ఓ మ్యూజియాన్నే ఏర్పాటు చేశాడు. దానికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటూ దక్కింది. ఆ విశేషాలు చెబుదామనే ఇదిగో ఇలా వచ్చా!

మెరికాలోని కాలిఫోర్నియా మెక్కాలో ఈ అంతర్జాతీయ అరటి మ్యూజియం ఉంది. దీన్ని కెన్‌ బన్నిస్టర్‌ అనే అరటి ప్రేమికుడు 1976లో ఏర్పాటు చేశాడు. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటిది. అత్యధిక అరటి వస్తువులు సేకరించిన మ్యూజియంగా 1999లో దీనికి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం దక్కింది.

స్టిక్కర్ల నుంచి పుట్టిన ఆలోచన..
ఈ మ్యూజియం ఏర్పాటు చేసిన కెన్‌.. ఫొటోగ్రఫీ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుండేవాడు. ఫొటోగ్రఫిక్‌ పరికరాల తయారీ సంస్థకు అధ్యక్షుడు కూడా. 1972లో ఒక సమావేశంలో పాల్గొనేందుకొచ్చిన వాళ్లకు అరటి ఆకారంలో ఉన్న స్టిక్కర్లను పంచిపెట్టాడట. అరటిపండు నవ్వుతున్నట్టున్న ఆ స్టిక్కర్లను చూసి వాళ్లు చాలా ముచ్చటపడ్డారు. ఆ ఉత్సాహంతో అంతర్జాతీయ అరటి క్లబ్‌ను ఏర్పాటు చేశాడు. అదిగో అలా అరటి సంబంధిత వస్తువుల్ని సేకరించడం మొదలుపెట్టాడు.

కుప్పలు తెప్పలుగా..
కొద్ది కాలంలోనే అరటి క్లబ్‌లో 17 దేశాల నుంచి 35 వేల సభ్యులు చేరారు. ఏదైనా అరటి ఆకారంలోని వస్తువును క్లబ్‌కు అందిస్తే చాలు.. వాళ్లు సభ్యులైనట్టే. ఇలా అరటి ఆకారంలోని వస్తువులు వేల సంఖ్యలో వచ్చిపడి.. కుప్పలు తెప్పలుగా పోగయ్యాయి. వాటిని ఉంచేందుకు చోటు లేకపోవడంతో మ్యూజియం పెట్టాలనే ఆలోచన వచ్చింది.

అణువణువూ అబ్బురమే..
ఈ అరటి మ్యూజియం సందర్శించాలంటే.. కొంత రుసుం చెల్లించాలి. లోపల అరటి ఆకారాల్లో ఉండే ఫోన్లు, కీ చెయిన్లు, పెన్నులు, గడియారాలు, చెప్పులు, రుమాలు హోల్డర్లు, తాటి చెట్టెక్కి అరటిపండు తింటున్న కోతి బొమ్మలు, బనానా కొండ, అరటి పియానో ఇలా ఒకటా రెండా 25 వేలకు పైగా బొమ్మలు అబ్బుర పరుస్తాయి. ఇంకా అక్కడున్న దుకాణంలో అరటిపండుతో చేసిన వంటకాలు దొరుకుతాయి. అరటి చిప్స్‌, పానీయాలు, బనానా షేక్‌, షోడా, చాక్లెట్లు కొనుక్కుని రుచి చూడొచ్చు. వాటి వివరాల పుస్తకాలనూ కొనుక్కోవచ్చు. కెన్‌ తర్వాత ఫ్రెడ్‌ అనే వ్యక్తి ఈ మ్యూజియం బాగోగులు చూస్తున్నాడు.

సరే ఫ్రెండ్స్‌.. ఉంటా ఇక. మీ అందరికీ అరటి మ్యూజియం గురించి చెప్పాను కదా.. నాకు వెంటనే ఓ అరటిపండు తినాలపిస్తోంది. నాకు తెలిసి మీకూ నాలానే అనిపిస్తూ ఉంటుంది కదూ! ఇంకేం తినేయండి మరి. బైబై!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని