ఆనందానికీ ఉందండోయ్‌.. ఓ మ్యూజియం!

పై శీర్షిక చదవగానే ఆశ్చర్యపోయారు కదూ! పడవల మ్యూజియం తెలుసు.. కార్లదీ తెలుసు.. సైకిళ్లకూ ఉందని విన్నాం.

Published : 25 Mar 2021 00:11 IST

పై శీర్షిక చదవగానే ఆశ్చర్యపోయారు కదూ! పడవల మ్యూజియం తెలుసు.. కార్లదీ తెలుసు.. సైకిళ్లకూ ఉందని విన్నాం. ఆఖరికి టాయిలెట్లదీ  తెలుసు.. కానీ ఆనందానికి మ్యూజియం ఏంటబ్బా! ఎప్పుడూ వినలేదే.. అనుకుంటున్నారు కదూ! అయితే ఇంకెందుకాలస్యం ఇది చదివేయండి మరి.

డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో ఉందీ ‘ది హ్యాపీనెస్‌ మ్యూజియం’. 2,585 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇది పర్యాటకుల్ని తెగ ఆకట్టుకుంటోంది. ఇక్కడ మొత్తం ఎనిమిది గదులుంటాయి. ఒక్కో గదిలో ఒక్కో ప్రత్యేకమైన సంగతిని తెలిపే ఏర్పాటు చేశారు. ఒక గదిలో ఆనందంగా ఉండటం గురించి వివరించి చెబుతారు. మరొక గదిలో మనిషి సంతోష క్షణాల గురించి ఏకంగా 2 వేల ఏళ్ల చరిత్ర వివరిస్తారు. ఇంకొక గదిలో భవిష్యత్తులో హాయిగా జీవించడం ఎలా అన్నది చెబుతారు. చిరునవ్వు ఎలా ఉంటుందో, ఎన్ని రకాలో మోనాలిసా చిత్రాల ద్వారా చూపిస్తారు. ఇలా వెళ్లిన దగ్గర్నుంచి సంతోషకరమైన కబుర్లతో కొత్త విషయాలు వివరిస్తూ మనల్ని అక్కడి వాళ్లంతా హాయిగా నవ్వుకుంటూ గడిపేలా చేస్తారు.

ప్రయోగశాలా ఉంది..
అక్కడికి వెళ్లిన పర్యాటకులు తమ జీవితంలోని ఆనంద క్షణాలను అక్కడున్న పుస్తకంలో రాయొచ్చు. ఇక ఒక గదిలో ఏకంగా సంతోష ప్రయోగశాల ఉంటుంది. అక్కడ మనసుకు సంతోషం కలిగితే ఎలాంటి అనుభూతి లభిస్తుందో ప్రయోగపూర్వకంగా చూపిస్తారు! ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆనందక్షణాలను నిక్షిప్తం చేసి ఉంచిన వీడియో చూపిస్తారు.
ఇంతకీ ఆలోచన ఎవరిదంటే..!
కోపెన్‌హాగన్‌లో ‘హ్యాపీనెస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’ ఉంది. దాని సీఈఓ మైక్‌ వైకింగ్‌కు ఈ ఆలోచన వచ్చింది. అంతే అనుకున్నదే తడవుగా తన స్నేహబృందంతో కలిసి దీన్ని ఏర్పాటు చేసేశారు. అలా ఓ ఐడియా ఆనందాన్నిచ్చింది. మొత్తానికి ఇవండీ ‘ది హ్యాపీనెస్‌ మ్యూజియం’ విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని