అనుకరిస్తా...బురిడీ కొట్టిస్తా!

ఓ చేప ఉంది. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? దానికి మిమిక్రీ వచ్చు. అవునూ.. ‘అరె చేపలకు మాటలే రావు కానీ మిమిక్రీ వచ్చా?’ అంటారేమో!? అయితే అది అనుకరణ చేసేది గొంతుతో కాదు.. రూపంతో. ఎలాగో ఏంటో చదివేయండి.

Published : 03 Apr 2021 03:57 IST

ఓ చేప ఉంది. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా? దానికి మిమిక్రీ వచ్చు. అవునూ.. ‘అరె చేపలకు మాటలే రావు కానీ మిమిక్రీ వచ్చా?’ అంటారేమో!? అయితే అది అనుకరణ చేసేది గొంతుతో కాదు.. రూపంతో. ఎలాగో ఏంటో చదివేయండి.

ఈ చేప పేరు లీఫ్‌ ఫిష్‌. అమెజాన్‌ లీఫ్‌ఫిష్‌ అనీ పిలిచేస్తారు. ఎక్కువగా బొలీవియా, బ్రెజిల్‌, కొలంబియా, పెరూ దేశాల్లోని నదుల్లో కనిపించేస్తుంటుంది. ఊసరవెల్లిలాంటి జీవులు పరిసరాల్లో కలిసిపోతూ శత్రుజీవుల్ని బోల్తా కొట్టిస్తాయనే విషయం వినే ఉంటారుగా. ఈ చేప కూడా అలాగే ఇతర జీవుల్ని మాయ చేస్తుంది.

ఇది నీటిలో ఈదుతూ ఉంటే.. ‘ఎండిపోయిన ఆకు నీటిలో పడి అటూ ఇటూ కొట్టుకువస్తుందేమో’ అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే దీని మూతి కాస్త పొడుగ్గా ఉండి మూతి దగ్గర ఆకుకు ఉన్నట్టే కాస్త వంపు ఉంటుంది. శరీరం సన్నగా అతుక్కునిపోయి, ముదురు గోధుమ రంగులో అచ్చం ఎండిన ఆకులానే ఉంటుంది. అంతేకాదూ.. ఈ చేప కూడా చనిపోయినట్టు నటిస్తూ ‘అసలు ఇది జీవే కాదు’ అన్నట్టు కనిపించేస్తుంది. ఆకుల మధ్యన నీళ్లలో అటూ ఇటూ కాస్త నెమ్మదిగా కదులుతూ చిన్న చిన్న జీవులు దగ్గరకు రాగానే ఠక్కున నోట్లో వేసేసుకుంటుంది. ఒకవేళ పెద్ద జీవులు దగ్గరగా వస్తే అస్సలు కదలకుండా మాయ చేసేస్తుంది. భలే చేప కదూ!
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని