Published : 24 Apr 2021 00:51 IST

ఇంతకీ నేనెవరు?

‘చూడ్డానికి కాస్త ఎలుకలా ఉన్నాను.. కానీ ఎలుకను కాదు.. ఎందుకంటే నా రంగు, తోక పొడవు, చెవులు కాస్త భిన్నం. మరి ఇంతకీ నేను ఎవరు?’ ఇది చదివి ఏదైనా పొడుపుకథేమో.. అనుకుంటే పొరపాటే. ఇది నా కథే. కానీ పూర్తిగా తెలియని కథ. ఇంతకీ నేను ఎవరు.. ఈ కథనం చదివేయండి మీకే అర్థమవుతుంది.
నేను ఎవరో తెలుసుకోవడానికి ఎంత బుర్రలు బద్దలు కొట్టుకున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు లేను. ఎప్పుడో అంతరించిపోయాను. పురాతన కాలంనాటి జీవినన్నమాట. ఇటీవల మధ్యప్రదేశ్‌లో శాదోల్‌ జిల్లాలో టికి అనే గ్రామంలో 22 కోట్ల సంవత్సరాల నాటి శిలాజాలు బయటపడ్డాయి. అవి నావే. వాటిమీద ఖరగ్‌పూర్‌ లోని ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ వారు పరిశోధనలు చేశారు. ఎలుకను పోలిన జీవిగా నిపుణులు భావించారు. పది పళ్ల అవశేషాలు దొరికితే.. వాటిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో పరిశీలించినప్పుడు అవి ఎలుక పళ్లలా అనిపించాయి. కానీ నేను ఎలుకను కాదుగా!
రెవాకోనోడాన్‌ ఇండికస్‌..
నా దంతాలను వాళ్లు అధ్యయనం చేసినప్పుడు అవి కిరీటం ఆకారంలో ఉండడం గమనించారు. ఇదేదో కొత్త జీవిలా ఉందని, నాకు ‘రెవాకోనోడాన్‌ ఇండికస్‌’ అనే పేరు పెట్టారు.  దీన్ని ఇండియాలో గుర్తించారు కాబట్టి చివర్లో ‘ఇండికస్‌’ అని పెట్టారు. సంతోషమే కానీ.. ఈ నోరు తిరగని పదాలే దొరికాయా? మీ సైంటిస్టులకు అని నాకు బాధేస్తోంది. మీలాగా.. ఎంచక్కా రమేష్‌ అనో.. సురేష్‌ అనో.. అనిత అనో.. సునీత అనో.. అలాంటిది ఒకటి పెడితే ఎంత బాగుండు!
మరింత లోతుగా పరిశోధనలు
సాధారణంగా మాలాంటి జీవుల్ని ‘సైనోడాంట్స్‌’ అని పిలుస్తారంట. వాటిలో క్షీరదాలు అంటే పిల్లల్ని కని పాలిచ్చేవి, గుడ్లు పెట్టేవి రెండూ ఉంటాయి. నేనైతే క్షీరదాన్నే! ప్రస్తుతానికి ఈ సంగతులు చెప్పారు శాస్త్రవేత్తలు. ఇప్పటికైనా నా గురించి మీకు తెలిసింది. ఎందుకంటే నేను అంతరించిపోయి కొన్ని కోట్ల ఏళ్లవుతోంది కదా! ఏం ఫర్వాలేదు.. సైంటిస్టులు మరింత లోతుగా పరిశోధనలు చేసే పనిలో ఉన్నారు. అవి ఓ కొలిక్కి వస్తే నా గురించి పూర్తిగా తెలుస్తుంది. అదన్నమాట విషయం. ఇక ఉంటా మరి బైబై!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు