మౌనంగానే పొదగమని..

అనగనగా ఓ పక్షి... వయసేమో 70.. ఈ వయసులోనూ అది గుడ్డు పెట్టింది.. అంతేనా ఎంచక్కా దాన్ని పొదిగింది. పండంటి

Published : 27 Apr 2021 01:05 IST

అనగనగా ఓ పక్షి... వయసేమో 70.. ఈ వయసులోనూ అది గుడ్డు పెట్టింది.. అంతేనా ఎంచక్కా దాన్ని పొదిగింది. పండంటి పక్షికి జన్మనిచ్చింది! అసలు ఇన్నేళ్లు బతకడమే గొప్ప అనుకుంటే ఏకంగా గుడ్లనే పెడుతోంది. మరి ఆ పక్షేంటో.. దాని సంగతులు ఏంటో తెలుసుకుందామా!

ఈ పక్షి పేరు విజ్డమ్‌. ఇది అల్బట్రాస్‌ రకానికి చెందింది. సాధారణంగా ఈ రకానికి చెందిన పక్షులు 12 నుంచి 40 సంవత్సరాల వరకు జీవిస్తాయంతే! కానీ ఈ విజ్డమ్‌ మాత్రం ఏకంగా 70 ఏళ్లుగా హాయిగా బతికేస్తోంది. గత ఫిబ్రవరి ఒకటిన అమెరికాలోని ‘మిడ్‌వే అటోల్‌ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’లో తన గుడ్డును పొదిగి బుజ్జి పిట్టకు ప్రాణం పోసింది.
నవంబరులో నాంది!
ఈ విజ్డమ్‌.. నవంబరు నెలాఖర్లో గుడ్డు పెట్టి ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ఇది తన జీవితకాలంలో 30 నుంచి 36 పక్షులకు జన్మనిచ్చి ఉంటుందని చెబుతున్నారు. ఈ అల్బట్రాస్‌ పక్షులు కేవలం ఒకే ఒక గుడ్డు పెడతాయి. అది కూడా రెండు మూడేళ్లకు ఒక్కసారి మాత్రమేనంట.

అప్పటి నుంచే ఫాలో అవుతూ..

అన్నట్లు మన విజ్డమ్‌ను అక్కడి పరిశోధకులు 1956లో మొదటి సారిగా గుర్తించారంట. ఇక అప్పటి నుంచి దాని కాలికి ట్యాగ్‌ అమర్చి ఫాలో అవుతున్నారంట. అలా చేయడం వల్లే దీనికి ప్రస్తుతం దాదాపు 70 ఏళ్లు అని తెలుస్తోంది. రికార్డుల ప్రకారం.. అత్యంత ఎక్కువ వయసున్న అల్బట్రాస్‌ పక్షి ఇదేనంట. ఎంతైనా ఈ విజ్డమ్‌ చాలా గ్రేట్‌ కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని