Published : 29 Apr 2021 00:12 IST

అదో మంచుప్రపంచం!

బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో కూర్చుంటే ఉక్కపోత. అబ్బబ్బా.. ఏంటీ అవస్థ. నా వల్ల కావట్లేదు బాబోయ్‌.. అనిపిస్తుంది. కానీ థాయ్‌లాండ్‌లోని పటాయాలో మాత్రం ఎండల్లేవ్‌.. గిండల్లేవ్‌.. అక్కడ ఓ చోటకు వెళ్తే మండే ఎండలూ మౌనంగా ఉండిపోకతప్పదు. ఆ ప్రదేశంలో కాలు మోపితే  మంచుకొండల్లో.. కాదు.. కాదు.. స్వర్గంలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. ఇంతకీ ఆ చోటు ఏంటంటే..

అది పటాయాలోని ‘మ్యాజికల్‌ ఐస్‌ ఆఫ్‌ సియామ్‌’ అనే ప్రదేశం. అక్కడ 30 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో తెల్లని శిల్పాలు దర్శనమిస్తాయి. అవన్నీ మంచు, తెల్లని ఇసుకతో తయారు చేసిన శిల్పాలేనట. రెక్కల చేప, ఏనుగు, ఒంటి కొమ్ము గుర్రం, చెట్లు, స్నోమెన్‌లు.. ఒకటా రెండా బోలెడన్ని ఉన్నాయి. వాటిని చూస్తే ప్రాణమున్న జీవుల్లానే అనిపిస్తాయి తెలుసా! వాటిలో అంతలా జీవకళ ఉట్టిపడుతుంది మరి. మొదటి మంచు గోపురం 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటుంది. అక్కడ ప్రదర్శనలూ, వినోద కార్యక్రమాలూ జరుగుతాయి. అసలు అవన్నీ చూశాక స్వర్గలోకపు అంచులదాకా వెళ్లినట్లుంది అనక మానరు. పైగా వాటిని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవంటే నమ్మండి.

ఐస్‌ గ్లాస్‌లో జ్యూస్‌..
విచిత్రమేంటంటే.. ఎవరైనా జ్యూస్‌లో ఐస్‌ ముక్కలు వేసుకుంటారు. కానీ ఇక్కడ.. ఐస్‌ గ్లాసుల్లో జ్యూస్‌ ఇస్తారు. ఇక చూస్కోండి.. ఎంత చల్లగా ఉంటుందో.. ఈ ప్రదేశాన్ని సందర్శించేవాళ్లకు వాళ్లు ఎంచుకున్న ప్యాకేజీని బట్టి ఆహార ఏర్పాట్లు చేస్తారు. ఆట గదుల్లో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ గదుల లోపల, బయట పెద్ద పెద్ద శిల్పాలు వాళ్ల పట్టణ సంస్కృతిని తెలిపే విధంగా ఉంటాయి. ఇతిహాసాల కథల్లో కనిపించే వింత జీవుల్ని చూడొచ్చు. సాహిత్యంలో కనిపించే పాత్రలను వర్ణించే ‘ది హిమ్మపాన్‌’నూ వీక్షించొచ్చు. ఈ మంచు మాయా నగరంలో ఏ మూల చూసినా విచిత్రాలే. కానీ అక్కడికి వెళ్లాలంటే మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే సుమీ..! లేకపోతే మనం గడ్డకట్టుకుపోవాల్సిందేనంట. ఇవీ మ్యాజికల్‌ ఐస్‌ ఆఫ్‌ సియామ్‌ విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు