చేప కొంచెం.. మోత ఘనం!

అనగనగా ఓ చేప దాని ఆకారం చిన్నదే.. కానీ మోత మాత్రం ఘనం! అలా అని అది ఏమైనా నోటితో శబ్దాలు చేస్తుందనుకుంటే పొరపాటే! మరి ఆ శబ్దం ఎలా వస్తుందో.. తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకేం చదివేయండి..

Published : 01 May 2021 00:39 IST

అనగనగా ఓ చేప దాని ఆకారం చిన్నదే.. కానీ మోత మాత్రం ఘనం! అలా అని అది ఏమైనా నోటితో శబ్దాలు చేస్తుందనుకుంటే పొరపాటే! మరి ఆ శబ్దం ఎలా వస్తుందో.. తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకేం చదివేయండి..

ట్లాంటిక్‌ క్రోకర్‌ చేపలు గల్ఫ్‌ తీరం నుంచి అర్జెంటీనా వరకున్న సముద్రజలాల్లో ఉంటాయి. కానీ ఎక్కువగా అమెరికా అట్లాంటిక్‌ తీరంలో కనిపిస్తుంటాయి. అందుకే వీటిని ‘అట్లాంటిక్‌ క్రోకర్స్‌’ అని పిలుస్తుంటారు. ఇవి తమ పొత్తికడుపు కండరాలతో ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని చేస్తాయి. ఆ శబ్దాలు చాలా పెద్దగా వస్తాయి. వీటిలో ఒక రకమైన గల్ఫ్‌ కోర్వినా చేపలైతే ఏకంగా దాదాపు 202 డెసిబుల్స్‌ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి.
చెవులు తూట్లు పడాల్సిందే..
ఇవి గుంపులుగా ఓ చోట చేరి శబ్దాలు చేస్తే చుట్టుపక్కల వాతావారణం అంతా బీభత్సంగా మారిపోతుంది. మరబోటులో ప్రయాణిస్తున్నామనుకో.. దాని ఇంజిన్‌ ఎంత రొద చేసినా, అప్పుడు కూడా ఈ చేపల మోత మనకు వినిపిస్తుంది. సీ లయన్స్‌, డాల్ఫిన్లలాంటి ఇతర జీవులకు చెవులు తూట్లు పడి, అవి వినికిడి శక్తి కోల్పోయేలా చేయగలవు ఇవి. ఒక్క తిమింగలాలు మాత్రమే వీటికి మించిన శబ్దాలను చేయగలవంటేనే తెలుస్తోంది కదా.. ఈ క్రోకర్‌ చేపల గొప్పతనం.
రంగులూ మార్చుకుంటుంది
ఈ చేపలు సాధారణంగా 18 నుంచి 20 అంగుళాల వరకు పొడవు పెరుగుతాయి. వీటి జీవిత కాలం ఎనిమిది సంవత్సరాలు. ఇవీ తమ రంగును మార్చుకుంటాయి. కానీ ఊసరవెల్లి అంత వేగంగా కాదు. ఆగస్టు నుంచి అక్టోబరు మధ్యకాలంలో ఇవి ముదురు బంగారు వర్ణంలోకి మారతాయి. ఆ సమయంలో వీటిని ‘గోల్డెన్‌ క్రోకర్‌’ లేదా ‘ఎల్లో క్రోకర్‌’ అని పిలుస్తారు. తర్వాత మళ్లీ ఇది తన మామూలు రంగులోకే వస్తుంది. ఇవీ మోత మోగించే క్రోకర్‌ చేప విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని