చిటికెలో మాయ!

ఎర్రని టేప్‌ క్షణాల్లోనే తెల్లగా మారుతుంది. మళ్లీ అంతలోనే ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా ఒక్కసారో.. రెండుసార్లో కాదు.. కొన్ని వందలు, వేల సార్లు చేయొచ్చు.

Updated : 04 May 2021 06:04 IST

అబ్రకదబ్ర హాం ఫట్‌!

ఎర్రని టేప్‌ క్షణాల్లోనే తెల్లగా మారుతుంది. మళ్లీ అంతలోనే ఎరుపు రంగులోకి మారుతుంది. ఇలా ఒక్కసారో.. రెండుసార్లో కాదు.. కొన్ని వందలు, వేల సార్లు చేయొచ్చు. ‘ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది’ అని ఎదుటివారిని ఆశ్చర్యపరచవచ్చు. మరి అది ఎలాగో మనమూ నేర్చుకుందామా!
ముందుగా మీరొక ఎరుపురంగు టేప్‌ రోల్‌ తీసుకోండి. దాన్ని ప్రేక్షకులకు చూపించండి. ఇప్పుడు మరో చేతితో చార్టును తీసుకొని టేప్‌ రోల్‌ పట్టుకున్న చేతికి అడ్డంగా పెట్టండి. ‘అబ్రక దబ్ర హాంఫట్‌’ అంటూ చార్టును పక్కకు జరపండి. విచిత్రం.. ఇంతకు ముందు వరకు ఎరుపు రంగులో ఉన్న టేప్‌ రోల్‌.. తెలుపు రంగులో కనిపిస్తుంది.
ఇప్పుడు మరోసారి చార్టును టేప్‌ రోల్‌ పట్టుకున్న చేతికి అడ్డుగా తీసుకురండి. మళ్లీ దాన్ని పక్కకు జరపండి. తెలుపు రంగులో ఉన్న టేప్‌ రోల్‌.. ఎరుపు రంగులోకి మారుతుంది.

కిటుకు ఏంటంటే.. .
నిజానికి ఈ మ్యాజిక్‌ చేయడం చాలా తేలిక.. కాకపోతే చిన్న కిటుకు తెలిసి ఉండాలి అంతే. టేప్‌ రోల్‌లోనే అసలు మాయ ఉంటుంది. టేప్‌ రోల్‌కు ఓ వైపు ఎరుపు రంగు, మరో వైపు తెలుపు రంగు ఉంటుంది. టేప్‌ రోల్‌ లోపలి వైపు కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే బయట ఉన్నదానికి వ్యతిరేకంగా అన్నమాట. ప్రేక్షకులకు చూపించినప్పుడు టేప్‌ రోల్‌ బయట వైపు, లోపల వైపు ఒకే రంగు ఉన్నట్లు కనిపించడం కోసమే ఈ ఏర్పాటు. చార్టు అడ్డుగా పెట్టినప్పుడు మరో చేతిలో ఉన్న టేప్‌ రోల్‌ను జాగ్రత్తగా తిప్పాలి. ఇంతకు ముందు ఎరుపు రంగు ఉంటే.. ఇప్పుడు తెలుపు రంగు వచ్చేలా చూసుకోవాలి. తర్వాత చార్టును అడ్డు తీసేస్తే సరి.. వీక్షకులు ఒక్కసారిగా అవాక్కవుతారు.

జాగ్రత్తలు
ఒకటికి రెండు సార్లు ఈ మ్యాజిక్‌ను ముందుగానే ప్రాక్టీస్‌ చేసుకోవాలి. టేప్‌ రోల్‌కు రెండు రంగులున్నట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులకు తెలియకుండా జాగ్రత్తపడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని