Published : 10 May 2021 00:50 IST

నాణెం మాయం.. తాళం చెవి ప్రత్యక్షం!

అబ్రకదబ్ర హాంఫట్‌

నాణెం ఉన్నట్లుండి మాయమైపోతుంది. అంతేనా అది ఏకంగా తాళం చెవిగా మారిపోతుంది. ఇలా జరిగితే ఎవ్వరైనా సరే అవాక్కవుతారు కదా! మరి ఈ మ్యాజిక్‌ ఏంటో.. ఎలా చేయడమో మనమూ తెలుసుకుందామా?

ముందుగా మీరు మీ కుడి చేతి నుంచి నాణేన్ని ఎడమ చేతిలోకి తీసుకుంటారు. ‘అబ్రకదబ్ర హాంఫట్‌..’ అంటూ ఎడమచేయి గుప్పిట మూస్తారు. మళ్లీ ‘అబ్రకదబ్ర హాంఫట్‌’ అంటూ.. కుడి చేతి వేళ్ల సాయంతో ఎడమచేతి గుప్పిటలో ఉన్న నాణేన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. విచిత్రం.. నాణెం బదులు తాళం చెవి వస్తుంది. ఆగండి.. ఆగండి.. అప్పుడే ప్రయత్నించకండి. ఏ ప్రయోజనమూ ఉండదు. ఎందుకంటే ఈ మ్యాజిక్‌ రావాలంటే ఓ ట్రిక్‌ తెలిసుండాలి. మరి ఆ ట్రిక్‌ ఏంటో తెలుసుకుందామా?

కిటుకు ఏంటంటే..
మీరు నాణేన్ని గుప్పిట మూసే సమయంలోనే కిటుకంతా ఉంటుంది. ఏంటంటే.. కుడిచేతితో మీరు నాణేన్ని మాత్రమే కాదు. తాళంచెవిని కూడా పట్టుకుని ఉంటారు. కానీ అది ప్రేక్షకులకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.  తాళం చెవి తలభాగం మీద రూపాయి నాణెం ఉంటుంది. చూసేవాళ్లకు తాళంచెవి అస్సలు కనిపించదు. కేవలం నాణెం మాత్రమే కనిపిస్తుంది. కుడి చేతిని నెమ్మదిగా ఎడమచేతిలోకి తీసుకెళ్లి జాగ్రత్తగా నాణేన్ని, తాళం చెవిని విడుస్తాం. ఇప్పుడు ఎడమచేయి గుప్పిట మూస్తాం. కాసేపటికి కుడిచేత్తో ఎడమచేతి గుప్పిట నుంచి నెమ్మదిగా తాళం చెవిని బయటకు తీస్తాం. అంతే.. మ్యాజిక్‌ అయిపోయింది. ఓస్‌ ఇంతేనా... అని అంటారేమో.. చూడటానికి ఇది తేలికగా అనిపించినా.. చేయడం అంత సులభం ఏమీ కాదు. ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్‌ చేస్తేనే సరిగ్గా చేయగలం. అంటే ‘ప్రాక్టీస్‌ మేక్స్‌ మ్యాజిక్‌ ఫర్‌ఫెక్ట్‌’ అన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు