నేను అరిస్తే మెరుపులే!

తాజాగా అరేబియా సముద్రంలో అల్లకల్లోలానికి, ఉరుములు, మెరుపులు, వర్ష బీభత్సానికి కారణమైన తౌక్టే తుపాను పేరు వినే ఉంటారు కదూ. దానికి ఆ పేరు మయన్మార్‌ వాళ్లు సూచించారు.

Published : 20 May 2021 00:07 IST

తాజాగా అరేబియా సముద్రంలో అల్లకల్లోలానికి, ఉరుములు, మెరుపులు, వర్ష బీభత్సానికి కారణమైన తౌక్టే తుపాను పేరు వినే ఉంటారు కదూ. దానికి ఆ పేరు మయన్మార్‌ వాళ్లు సూచించారు. బర్మీస్‌ భాషలో తౌక్టే అంటే ‘పెద్దగా శబ్దం చేసే బల్లి’ అని అర్థం. ఈ తౌక్టే బల్లినే గెకో అనీ పిలుస్తుంటారు. మరి దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా!
ఈ గెకోలు ఓ రకంగా కాస్త చిన్న బల్లులే. ఇవి 1.6 నుంచి 60 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఇందులో మళ్లీ చాలా రకాలుంటాయి. ఎన్ని రకాలున్నా.. పే..ద్దగా శబ్దం చేయడమే వీటి ప్రత్యేకత. వీటికి కనురెప్పలుండవు. అందుకే ఇవి తమ కళ్లను నాలుకతో అప్పుడప్పుడూ శుభ్రం చేసుకుంటూ ఉంటాయి. దుమ్ము, ధూళి నుంచి రక్షించుకోవడంతో పాటు.. కళ్లలో తేమ కోసమే ఇవి ఇలా చేస్తాయన్నమాట.

దోమల్నీ భోంచేస్తాయి
సాధారణ బల్లుల్లానే ఈ తౌక్టేలు అదేనండి ఈ గెకోలు ఏదైనా జంతువు చేతికి చిక్కితే వాటి దృష్టి మరల్చడం కోసం తమ తోకను తెంపేసుకుంటాయి.చిన్న చిన్న కీటకాలు, సీతాకోకచిలుకలు, దోమల్ని ఇవి తిని తమ పొట్ట నింపుకొంటాయి.  మిగతా బల్లులతో పోల్చుకుంటే వీటికి గోడలు, చెట్ల మీద పట్టు ఎక్కువగా ఉంటుంది. వీటి కాళ్లకుండే దిండ్ల వంటి నిర్మాణమే దీనికి కారణం.

దండిగా దంతాలు..  
వీటికి ఊడిపోయిన కొద్దీ దంతాలు వస్తూనే ఉంటాయి. ఇలా మూడు నుంచి నాలుగునెలల వ్యవధిలోనే దాదాపు 100 దంతాల వరకు ఇది తెచ్చుకోగలదు. ఇవన్నీ ఒకెత్తు.. ఇవి చేసే పెద్ద పెద్ద శబ్దాలు ఒకెత్తు. వీటి గొంతులో ఉండే ప్రత్యేక నిర్మాణాల వల్ల ఇలా పే..ద్ద ధ్వనులు చేయగలవు. తమ తోటి బల్లులను ఆకర్షించడానికి.. వాటితో సంభాషించడానికే ఇవి ఇలా చేస్తుంటాయి. మొత్తానికి ఇవండీ మన తౌక్టే విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని