మాయ.. అంతా మాయ!

అక్కడ రేడియో సిగ్నళ్లు మూగబోతాయి.. మొబైల్‌ తరంగాలూ మాయమవుతాయి.. టీవీ సిగ్నళ్లూ.. మొరాయిస్తాయి. దిక్సూచేమో ‘నేను దిక్కులు సూచించను పో..’ అని మారాం చేస్తుంది.

Published : 31 May 2021 00:15 IST

అక్కడ రేడియో సిగ్నళ్లు మూగబోతాయి.. మొబైల్‌ తరంగాలూ మాయమవుతాయి.. టీవీ సిగ్నళ్లూ.. మొరాయిస్తాయి. దిక్సూచేమో ‘నేను దిక్కులు సూచించను పో..’ అని మారాం చేస్తుంది.
చదువుతుంటే చందమామ కథను తలపిస్తున్న ఈ మాయంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా.. జోన్‌ ఆఫ్‌ సైలెంట్‌గా పిలిచే మాప్ని సైలైంట్‌ జోన్‌లో! ఇంతకీ ఇది ఎక్కడుందబ్బా.. అనేగా మీ సందేహం. మెక్సికోలోని మాప్ని బయోస్పియర్‌ రిజర్వ్‌లో ఉందీ ఈ ప్రాంతం. ఇదో ఎడారి.

రాకెట్‌ వల్లే ఇదంతా..!

1970 జులైలో న్యూమెక్సికో పరిసర ప్రాంతంలోని గ్రీన్‌ రివర్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి ప్రయోగించిన ఓ రాకెట్‌ ఈ జోన్‌ ఆఫ్‌ సైలెన్స్‌ ప్రాంతంలో పడిపోయింది. దాని ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో సిబ్బంది వాకీటాకీలు ఇక్కడ పనిచేయలేదు. దిక్సూచి కూడా సరిగా దిక్కులు చూపించలేదంట. దీంతో ఈ ప్రాంతం గురించి వెలుగులోకి వచ్చింది. దీనంతటికీ భూ అయస్కాంత తరంగాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తర్వాత్తర్వాత ఈ ప్రాంతం గురించి చాలా వదంతులు, అభూత కల్పనలు ప్రచారంలోకి వచ్చాయి. ఫ్లైయింగ్‌ సాసర్లు, గ్రహాంతర వాసులు ఇక్కడ తిరుగుతున్నారనే పుకార్లూ వ్యాపించాయి. కానీ వీటిలో దేనికీ సరైన ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు. మీకు మరో వింత తెలుసా..? అది ఏంటంటే. ఈ జోన్‌ ఆఫ్‌ సైలెన్స్‌, బెర్ముడా ట్రయాంగిల్‌, గీజా పిరమిడ్‌ ప్రపంచపటంలో ఒకే సరళరేఖపై ఉంటాయి. ఇలా ఈ ప్రాంతం ఎన్నో వింతలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా పేరుపొందింది. ఇవండీ జోన్‌ ఆఫ్‌ సైలెన్స్‌ విషయాలు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని