పిసోనియా.. పక్షుల పాలిట యమరాజు!

నేస్తాలూ... పచ్చని చెట్లు ఎక్కడుంటే.. అక్కడ పక్షుల కిలకిలరావాలు వినిపిస్తాయి కదూ! వాటి రెక్కల చప్పుళ్లతో వాతావరణం సందడి సందడిగా మారుతుంది కదా! కానీ ఓ చెట్టంటే మాత్రం పిట్టలకు హడల్‌! పోనీ అదేమన్నా విషపు చెట్టా అంటే.. ఊహూ కానే కాదు. అయినా అది అభంశుభం తెలియని పక్షుల ప్రాణాలు తీసేస్తోంది.

Published : 04 Jun 2021 01:08 IST

నేస్తాలూ... పచ్చని చెట్లు ఎక్కడుంటే.. అక్కడ పక్షుల కిలకిలరావాలు వినిపిస్తాయి కదూ! వాటి రెక్కల చప్పుళ్లతో వాతావరణం సందడి సందడిగా మారుతుంది కదా! కానీ ఓ చెట్టంటే మాత్రం పిట్టలకు హడల్‌! పోనీ అదేమన్నా విషపు చెట్టా అంటే.. ఊహూ కానే కాదు. అయినా అది అభంశుభం తెలియని పక్షుల ప్రాణాలు తీసేస్తోంది. ఏంటా చెట్టు? ఏమా విషం.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని ఉందా?
పక్షుల్ని చంపే ఈ చెట్టు పేరు పిసోనియా. దీన్ని ‘బర్డ్‌ క్యాచర్‌’ అనీ పిలుస్తారు. ఇది ఆఫ్రికా, ఇండో పసిఫిక్‌ ప్రాంతాల్లో పెరుగుతుంది. సాధారణంగా చెట్లు పక్షులకు ఆవాసాన్ని కల్పిస్తాయి. పక్షులు పండ్లు తినగా నేలరాలే విత్తనాల వల్ల మొక్కలు వృద్ధి చెందుతాయి. అంతవరకూ బాగానే ఉంది కానీ పక్షుల్ని ఈ చెట్లు చంపడం ఏంటంటే..
ఇందులో విషమేమీ లేదు కానీ..
ఇది విషపు చెట్టేం కాదు. అన్ని చెట్లలా ఇది కూడా సాధారణమైనదే! ఈ చెట్టుకు మొదట గుత్తులు గుత్తులుగా వందల సంఖ్యలో పువ్వులు పూస్తాయి. అవి కాయలవుతాయి. వాటిలో ఉండే గింజలే దీనంతటికీ కారణం. వీటిలో ఒక రకమైన జిగట పదార్థం ఉంటుంది. పైగా వాటిపైన సన్నని కొక్కేలూ ఉంటాయి. ఈ జిగురు గింజల మీద పక్షులు వచ్చి వాలాయో ఇక అంతే సంగతులు. వాటి కాళ్లు, రెక్కలకు జిగురు అంటుకుంటుంది.

అది వదలదంతే..
ఇది మామూలు జిగురు కాదు. అంటుకుంటే వదలనంత శక్తిమంతమైనది. ఇంకేముంది పక్షులు చెట్టు మీద వాలగానే తల దగ్గర నుంచి తోక వరకూ ఈ గింజలు అతుక్కుపోతాయి. ఇక పక్షులు ఎగరలేవు. పాపం అవి అప్పటికీ ఓపిక చేసుకుని ఎగరడానికి ప్రయత్నించినా, కాస్త దూరంలోనే కింద పడిపోతాయి. అటు కదల్లేక, ఇటు తిండీ తిప్పలు లేక చివరికి చనిపోతాయన్నమాట. అదీ సంగతి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని