Updated : 28 Jun 2021 06:25 IST

భలే.. భలే.. బాహుబలి కప్పను నేను!

మాములుగా కప్పలు ఎంతుంటాయి.. మహా అయితే పెద్దవాళ్ల అరచేయంత ఉంటాయి.. అంటారేమో..! నేనైతే ఏకంగా చిన్న పిల్లాడంత ఉంటాను. అంత పెద్దగానా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! అవును మరి.. ఆ మాత్రం ఉంటాను కాబట్టే నా గురించి మీతో చెప్పుకొందామని  ఇదిగో ఇలా వచ్చాను.  ఇంకెందుకాలస్యం నా విశేషాలేంటో తెలుసుకుందామా!

గొలియత్‌ ఫ్రాగ్‌.. గొలియత్‌ బుల్‌ఫ్రాగ్‌.. జెయింట్‌ స్లిపరీ ఫ్రాగ్‌.. కంగారు పడకండి నేస్తాలూ..! ఇవన్నీ నా పేర్లే. నేను మామూలు కప్పను కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద కప్పగా నాకు రికార్డు ఉంది. నేను ఏకంగా మూడు కిలోల వరకు పెరుగుతాను. మరేంటి నువ్వు మాకు ఎప్పుడూ కనిపించలేదు అంటారేమో..! నేను మీ దగ్గర ఉండను ఫ్రెండ్స్‌, ఆఫ్రికా ఖండంలో ఉంటాను. అదీ కేవలం కెమరూన్‌, ఈక్వటోరియల్‌ గ్వినియాలో మాత్రమే కనిపిస్తుంటా.

అయ్‌.. బాబోయ్‌ ఎంత పొడవో!

నేను ఇందాకే చెప్పాను కదా.. నా బరువెంతో! ఇక పొడవు విషయానికొస్తే 17 నుంచి 32 సెంటీమీటర్ల వరకు పెరుగుతాను. నా కనుగుడ్లే దాదాపు 2.5 సెంటీమీటర్ల పొడవుంటాయి. మా టాడ్‌పోల్‌ లార్వాలైతే ఏకంగా మీ దగ్గరుండే కప్పలంత పరిమాణంలో ఉంటాయి తెలుసా.

నదులే నా ఆవాసం

నేను ఎక్కువగా నదుల్లో కనిపిస్తుంటా. నీటిమొక్కలు, పురుగులు, తూనీగలు, మిడతలు, సాలెపురుగులు, పీతలు, చేపలు, పాములు, గబ్బిలాలు, తాబేళ్లు, చిన్న చిన్న కప్పలు.. ఇలా చాలా వాటిని హాం.. ఫట్‌ చేసేస్తుంటా. నా జీవిత కాలం 15 సంవత్సరాలు. నన్ను చక్కగా సంరక్షిస్తే 21 ఏళ్ల వరకూ బతకగలను. ఇవండీ నా విశేషాలు. ఇక ఉంటా మరి బై.. బై!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు