కూటి కోసం నీటి విద్యలు!

ఒంటెలు అనగానే మనకు టక్కున ఎడారి, ఇసుక దిబ్బలు గుర్తుకు వస్తాయి. వీటికి ఎడారి ఓడలు అనే పేరు కూడా ఉండనే ఉంది. కానీ గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలోని ఖరాయి ఒంటెలు మాత్రం నీటిలో ఈదగలవు.

Published : 14 Sep 2021 00:37 IST

ఒంటెలు అనగానే మనకు టక్కున ఎడారి, ఇసుక దిబ్బలు గుర్తుకు వస్తాయి. వీటికి ఎడారి ఓడలు అనే పేరు కూడా ఉండనే ఉంది. కానీ గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలోని ఖరాయి ఒంటెలు మాత్రం నీటిలో ఈదగలవు. సముద్రంలోనూ జలకాలాడగలవు! ప్రపంచంలో ఇంకెక్కడా ఒంటెలు ఇలా చేయవు! మరి ఈ ఖరాయి ఒంటెల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా!

‘కూటి కోసం కోటి విద్యలు’ అంటుంటారు కదా.. కానీ ఈ ఖరాయి ఒంటెల విషయంలో దాన్ని ‘కూటి కోసం నీటి విద్యలు’గా మార్చుకొని చదువుకోవాలి! ఎందుకంటే.. ఈ ఖరాయి ఒంటెలు చిన్న చిన్న దీవుల్లోని మడ అడవుల్లో దొరికే మేత కోసం కచ్‌ జలసంధిలో ఏకధాటిగా మూడుకిలోమీటర్లు ఈదుతూ వెళ్లగలవు. కేవలం జలసంధిలోనే కాదు... ఇవి అవసరమైతే ఎంచక్కా సముద్రంలోనూ ఈదగలవు.

అంతరించి పోయే స్థితిలో.. 

ఇంతటి విశిష్టతలున్న ఈ ఒంటెల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. 2018లో 2,200 ఉన్న వీటి సంఖ్య ప్రస్తుతం 1,800లకు పడిపోయింది. ఉప్పు తయారీ కంపెనీలు ఉప్పు కోసం మడ అడవుల్లోకి అలలు రాకుండా చేస్తున్నాయి. దీంతో ఒంటెలు తినే మొక్కలు అక్కడ పెరగడం లేదు. ఉన్నవి చనిపోతున్నాయి. దీంతో వాటి ఆహారానికి కొరత ఏర్పడుతోంది. ఉప్పు తయారీ కోసం తవ్వే గుంతల్లో పడి, కరెంటు తీగల వల్ల విద్యుత్తు షాక్‌కు గురై చాలా వరకు ఒంటెలు చనిపోతున్నాయి. భారత ప్రభుత్వం 2015లో ఈ ఖరాయి ఒంటెలను అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది. వాటి సంరక్షణ కోసం స్థానిక సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. త్వరలోనే ఈ ఖరాయి ఒంటెలకొచ్చిన కష్టం తొలగిపోవాలని... తిరిగి వాటికి మునుపటి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని