వెదురుతో.. మేలెంతో!

హాయ్‌.. నేస్తాలూ.. ఎలా ఉన్నారు... బాగున్నారా?.. నేనైతే బాగున్నా.. ఇంతకీ నేనెవరో తెలుసా..? నా పేరు వెదురు. ఈ రోజు నా దినోత్సవం. అందుకే నా విశేషాలు మీతో చెప్పి పోదామని ఇదిగో ఇలా వచ్చా!

Updated : 18 Sep 2021 05:36 IST

నేడు ప్రపంచ వెదురు దినోత్సవం

హాయ్‌.. నేస్తాలూ.. ఎలా ఉన్నారు... బాగున్నారా?.. నేనైతే బాగున్నా.. ఇంతకీ నేనెవరో తెలుసా..? నా పేరు వెదురు. ఈ రోజు నా దినోత్సవం. అందుకే నా విశేషాలు మీతో చెప్పి పోదామని ఇదిగో ఇలా వచ్చా!

టా సెప్టెంబర్‌ 18న ప్రపంచ వెదురు సంస్థ (వరల్డ్‌ బ్యాంబూ ఆర్గనైజేషన్‌) ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు. 2009 నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను ప్రకృతికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాను. ఆ విషయాన్ని, నా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ దినోత్సవం జరుపుతున్నారు.

‘వెదురో రక్షతి రక్షితః..’

నన్ను మీరు రక్షిస్తే నేను మిమ్మల్ని సంరక్షిస్తా.. అంటే ‘వెదురో రక్షతి రక్షితః’ అన్నమాట! నిజానికి మీకు నా వల్ల చాలా ఉపయోగాలున్నాయి. నేను చల్లని నీడనిస్తాను. గాల్లో పేరుకుపోయిన కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకొని వాతావరణంలోకి ఆక్సిజన్‌ను వదులుతాను. ‘ఇలా అన్ని మొక్కలు, వృక్షాలు చేస్తాయి కదా..!’ అనుకోవచ్చు మీరు. కానీ మిగతా వాటికన్నా.. నేను పెద్ద మొత్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకుంటాను తెలుసా! అందుకే నన్ను మీరు ఎంత రక్షిస్తే.. నేను మిమ్మల్ని.. మీ భూమినీ అంతగా కాపాడతా.

ఆన్‌లైన్‌ వేదికలోనూ...

ఈసారి ఆన్‌లైన్‌లోనూ ప్రపంచ వెదురు సంస్థ ఆధ్వర్యంలో నా సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఎలా అంటే #PlantBamboo అని ఉద్యమంలా ప్రచారం చేస్తోంది. మీకో విషయం తెలుసా.. ఇతర మొక్కల్లా నాకు పెద్దగా సంరక్షణ చర్యలు కూడా అవసరం లేదు. ఇలా మీరు నాటి వదిలేసినా చాలు నా పాటికి నేను బతికేస్తా. నేస్తాలూ.. ఇవీ నాగురించి విశేషాలు.

మీకు తెలుసా! 

* వెదురును కొందరు చెట్టు అని పొరబడుతుంటారు. కానీ అది చెట్టు కాదు. నిజానికి అది గడ్డి జాతికి చెందిన మొక్క.

* ప్రపంచంలోకెల్లా వేగంగా పెరిగే మొక్క వెదురు. 24 గంటల్లో ఒక మీటరు వరకు పొడవు పెరగగలదు.

* చైనా సంస్కృతిలో దృఢత్వానికి చిహ్నంగా వెదురును వాడతారు.

* థామస్‌ అల్వా ఎడిషన్‌ బల్బును కనిపెట్టే క్రమంలో మొదట వెదురుతోనే ఫిలమెంట్లు తయారు చేశారు.

* వెదురు ఆకులతో చేసిన టీ రుచి కూడా దాదాపు గ్రీన్‌ టీలాగే ఉంటుంది.

* ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 రకాల వెదురు మొక్కలున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని