నేనో నల్లపులినోచ్‌!

పెద్దపులి అనగానే ముదురు బంగారు రంగు.. అక్కడక్కడ తెలుపు రంగు, నల్లటి చారలు గుర్తుకు వస్తాయి కదూ! కొన్ని తెల్లపులులూ ఉంటాయనుకోండి. కానీ నా దారే వేరు! నేనో నల్ల పెద్దపులిని...

Published : 21 Sep 2021 00:40 IST

పెద్దపులి అనగానే ముదురు బంగారు రంగు.. అక్కడక్కడ తెలుపు రంగు, నల్లటి చారలు గుర్తుకు వస్తాయి కదూ! కొన్ని తెల్లపులులూ ఉంటాయనుకోండి. కానీ నా దారే వేరు! నేనో నల్ల పెద్దపులిని... ఇంకా నా గురించి చెప్పాలంటే... అమ్మో..! ఆశ.. దోశ.. అప్పడం.. వడ.. అన్నీ ఇక్కడే చెప్పేస్తా అనుకుంటున్నారా? ఆ పప్పులేం నా దగ్గర ఉడకవు. ఈ కథనం మొత్తం చదివేయండి.. మీకే తెలుస్తుంది!

యాభై సంవత్సరాలు వెనక్కి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్‌ జిల్లా సిమిలిపాల్‌ అడవుల్లో తాము నల్లపులులను చూశామని కొంతమంది గిరిజనులు చెప్పారు. అలా మొట్టమొదటిసారిగా మా ఉనికి ఈ ప్రపంచానికి తెలిసింది. విచిత్రం ఏంటంటే..  ముందు వాళ్లు చెప్పినప్పుడు ఎవరూ నమ్మనే లేదు. కట్టుకథ అని ఎగతాళి చేశారు. కానీ తర్వాత నిజంగా నల్లపులులు ఉన్నాయని తెలిసి అవాక్కయ్యారు. అప్పటి నుంచి మా మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

కేవలం ఇక్కడ మాత్రమే..

మేం ప్రపంచం మొత్తం మీద కేవలం సిమిలిపాల్‌లోనే కనిపిస్తాం. మా ఒంటి మీద నల్లటి చారలు చిక్కగా ఉంటాయి. మాలో కొన్ని పూర్తి నలుపులోనూ ఉంటాయి. జన్యువుల్లో వచ్చిన మార్పు వల్ల ఇలా జరుగుతోందని తాజాగా తేలింది. బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌ (ఎన్సీబీఎస్‌) శాస్త్రవేత్తలు దేశంలోని ఇతర పరిశోధన సంస్థలతో కలిసి ఈ అధ్యయనం చేశారు.

మాకు మేమే!

2018 గణాంకాల ప్రకారం మన భారతదేశంలో సుమారు 2,967 పెద్ద పులులున్నాయి. కానీ నల్లపులులమైన మమ్మల్ని మాత్రం వేళ్ల మీద లెక్కించవచ్చు. ఒడిశా పార్క్‌లో ఎనిమిది, టైగర్‌ రిజర్వ్‌లో మరో 12 వరకు ఉన్నాయి. ప్రస్తుతం మేం అంతరించిపోయే స్థితిలో ఉన్నాం. మేం సాధారణంగా మిగతా పెద్దపులులకు దూరంగా ఉంటాం. కేవలం నల్లపులులం మాత్రమే కలిసి ఉంటాం. అందుకే మా సంఖ్య పెద్దగా పెరగడం లేదు. నేస్తాలూ..! ఇవీ నా గురించి విశేషాలు. ఇక ఉంటా మరి.. బై... బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని