నా వయసు 116 సంవత్సరాలు!

నేస్తాలూ.. బాగున్నారా.. నేనో వీధి దీపాన్ని.. అలాంటి ఇలాంటి వీధి దీపాన్ని కాదు. మన భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ వీధిదీపాన్ని నేనే. కేవలం మన దేశంలోనే కాదు.. అసలు ఆసియా ఖండంలోనే మొదటి వీధిదీపాన్ని.

Published : 21 Oct 2021 00:44 IST

నేస్తాలూ.. బాగున్నారా.. నేనో వీధి దీపాన్ని.. అలాంటి ఇలాంటి వీధి దీపాన్ని కాదు. మన భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ వీధిదీపాన్ని నేనే. కేవలం మన దేశంలోనే కాదు.. అసలు ఆసియా ఖండంలోనే మొదటి వీధిదీపాన్ని. ఇంతకీ నేను ఎక్కడున్నాను.. నన్ను ఎప్పుడు? ఎవరు ఏర్పాటు చేశారో తెలుసా?!

ర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు అని మీకు తెలుసు కదా.. అదిగో అక్కడే నేను మొదటిసారి వెలుగులు పంచాను. నాకిప్పుడు కేవలం 116 సంవత్సరాలంతే! నేను 1905లో ఆగస్టు5న సాయంత్రం ఏడుగంటలకు మొదటిసారి వెలుగులు పంచాను. అంతకు ముందు కిరోసిన్‌తో వెలిగే వీధిదీపాలుండేవి. నా తర్వాత కొన్ని వందల వీధి దీపాలను బెంగళూరు నగరంలో ఏర్పాటు చేశారు. నెమ్మదిగా భారతదేశమంతా విస్తరించాను.

కరెంటు ఎక్కడిదబ్బా!

‘నిన్ను 1905లో ఏర్పాటు చేశారు సరే.. నువ్వు వెలగడానికి కరెంటు ఎవరు ఇచ్చారు?’.. ఇదేగా మీ సందేహం.. చెప్తా చెప్తా.. శివసముద్రలో అప్పుడే కొత్తగా ఓ జలవిద్యుత్తు కేంద్రం ఏర్పాటైంది. అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తు కేజీఎఫ్‌కు (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌) సరఫరా అయ్యేది. అక్కడ వాడుకోగా మిగిలిన విద్యుత్తుతో ఎలక్ట్రిక్‌ వీధి దీపాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ మిగులు విద్యుత్తే నాకు ప్రాణం పోసిందన్న మాట.

ఆ ముగ్గురు!

నేను వెలగడానికి ఓ ముగ్గురు కారణం. ఒకరు జె.డబ్ల్యు.మెర్స్‌. ఇతను అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఎలక్ట్రికల్‌ సలహాదారుగా వ్యవహరించేవారు. మరొకరు కల్నల్‌ పీహెచ్‌. బెన్సన్‌, ఇంకొకరు పీఎన్‌ కృష్ణమూర్తి. ఈయన మైసూర్‌ సంస్థానానికి దివాను. వీరి ప్రయత్నం వల్ల బెంగళూరులో విద్యుత్తు కాంతులు పరుచుకున్నాయి. ఆసియాలోనే మొదటి విద్యుత్తు వీధిదీపం వెలిగిన నగరంగా బెంగళూరు చరిత్రపుటల్లోకి ఎక్కింది. నేను ప్రస్తుతం ‘బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె’ వారి సంరక్షణలో ఉన్నాను. వాళ్లు నన్ను గత చరిత్రకు సాక్ష్యంగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇవీ నేస్తాలూ.. నా విశేషాలు. సరే.. ఇక ఉంటామరి..

ఆ.. ఏంటీ.. ఏదో అంటున్నారు సరిగా వినిపించడం లేదు.. ఓహో.. నాకు ‘బిలేటెడ్‌ హ్యాపీ బర్త్‌డే టూయూ’ అని శుభాకాంక్షలు చెబుతున్నారా.. థ్యాంక్యూ పిల్లలూ.. బై బై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని