భౌ.. భౌ.. మ్యావ్‌.. మ్యావ్‌..ఆమ్యామ్‌.. ఆమ్యామ్‌..!

బుజ్జి బుజ్జి పిల్లలమైన మనకు భౌ..భౌలన్నా.. మ్యావ్‌..మ్యావ్‌లన్నా.. చాలా ఇష్టం కదూ! మనలో కొంత మంది వాటిని పెంచుకుంటూ కూడా ఉంటారు. మనం కొన్నిసార్లు వీధికుక్కలకూ బిస్కెట్లు వేస్తుంటాం. కానీ ఓ నగరంలో మాత్రం వీధికుక్కలు, పిల్లుల కోసం

Published : 07 Nov 2021 01:38 IST

బుజ్జి బుజ్జి పిల్లలమైన మనకు భౌ..భౌలన్నా.. మ్యావ్‌..మ్యావ్‌లన్నా.. చాలా ఇష్టం కదూ! మనలో కొంత మంది వాటిని పెంచుకుంటూ కూడా ఉంటారు. మనం కొన్నిసార్లు వీధికుక్కలకూ బిస్కెట్లు వేస్తుంటాం. కానీ ఓ నగరంలో మాత్రం వీధికుక్కలు, పిల్లుల కోసం ఎంచక్కా వెండింగ్‌ యంత్రాలే ఉన్నాయి తెలుసా! అది ఏ నగరం.. ఆ మెషీన్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని ఉంది కదూ.. ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మరి.

నకు కుక్కలు, పిల్లులను మించిన నేస్తాలు ఏం ఉంటాయి చెప్పండి. మనం పెంచుకునేవి అయితే వాటికి తిండికి ఢోకా ఉండదు. కానీ వీధికుక్కలు, పిల్లులకైతే కడుపునిండడం చాలా కష్టం. టర్కీలోని ఇస్తాంబుల్‌లో అయితే వాటికి ఈ సమస్యే లేదు! ఎందుకంటే అక్కడ ఓ కంపెనీ వీటికి ఆహారాన్ని అందించే ఏటీఎమ్‌ మెషీన్లను ఏర్పాటు చేసింది మరి.

ప్లాస్టిక్‌ భూతానికి విరుగుడు

ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. ఈ ఏటీఎమ్‌ మెషీన్లు ఇటు మూగజీవుల ఆకలి తీర్చడంతోపాటు అటు పర్యావరణానికి ప్రమాదకారిగా ఉన్న ప్లాస్టిక్‌ సమస్యకు పరిష్కారం చూపుతున్నాయి. నీళ్లు తాగేసిన తర్వాత ప్లాస్టిక్‌ బాటిల్‌ను రోడ్డుపక్కనో, చెత్తబుట్టలోనో పారేయకుండా ఈ యంత్రంలో వేస్తే చాలు.. దానికి బదులుగా కుక్కలు, పిల్లులకు ఆహారం బయటకు వస్తుంది. బాటిల్‌లో ఏమైనా నీళ్లున్నా ఫర్లేదు.. వాటిని ఈ మెషీన్‌లో పోస్తే.. వాటితో మూగజీవాలు తమ దాహం తీర్చుకునే ఏర్పాటూ ఉంది.

కరోనా లాక్‌డౌన్‌లో..

కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ ఏటీఎమ్‌ యంత్రాలు మూగజీవాల ఆకలిదప్పికలు తీర్చుతున్నాయి. ఇటీవల కరోనా లాక్‌డౌన్‌లో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల వీధికుక్కలు, పిల్లుల్లాంటి మూగజీవాలు తిండి దొరకక ఆకలికి అలమటించి పోయాయి. కానీ ఇస్తాంబుల్‌లో మాత్రం ఈ యంత్రాల వల్ల వాటికి పెద్దగా సమస్య రాలేదు. ఇలా దాదాపు 1,50,000 వీధి కుక్కలు తమ ఆకలిని తీర్చుకున్నాయి.

ఎలా పనిచేస్తాయంటే...

ఈ యంత్రాలు సోలార్‌ ప్యానల్‌ సాయంతో పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు నీరు, ఆహారం, ప్లాస్టిక్‌ సీసాల వ్యర్థాల లెవల్‌ను డిస్‌ప్లే చేస్తుంటుంది. మన దగ్గర ఏటీఎమ్‌లలో డబ్బులు నింపినట్లే.. ఈ యంత్రాల్లోనూ అక్కడ నిర్వాహకులు ఆహారాన్ని నింపుతుంటారు. ఇస్తాంబుల్‌లో ఈ యంత్రాల వల్ల మంచి ఫలితాలు రావడంతో ఇలాంటి వాటినే తమ దగ్గరా ఏర్పాటు చేసుకోవడానికి 61 దేశాల వారు ఉత్సాహం చూపిస్తున్నారట. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా మరో 20 నగరాల్లో ఈ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి ఇవీ ఈ ఫుడ్‌ వెండింగ్‌ మెషీన్ల గురించిన విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని