దోమ.. దోమ.. అమ్మో దోమ!

దోమ ఎంతుంటుంది.. చాలా చిన్నగా ఉంటుంది కదూ! కానీ ఈ దోమ మాత్రం మిగతా దోమలతో పోల్చుకుంటే పెద్దగా ఉంటుంది. అందుకే దీన్ని ‘ఎలిఫెంట్‌ మస్కిటో’ అని, ‘ఆస్ట్రేలియన్‌ ఎలిఫెంట్‌ మస్కిటో’ అనీ పిలుస్తారు.

Published : 22 Dec 2021 01:15 IST

దోమ ఎంతుంటుంది.. చాలా చిన్నగా ఉంటుంది కదూ! కానీ ఈ దోమ మాత్రం మిగతా దోమలతో పోల్చుకుంటే పెద్దగా ఉంటుంది. అందుకే దీన్ని ‘ఎలిఫెంట్‌ మస్కిటో’ అని, ‘ఆస్ట్రేలియన్‌ ఎలిఫెంట్‌ మస్కిటో’ అనీ పిలుస్తారు. మరి దీని విశేషాలేంటో తెలుసుకుందామా!

‘టెక్సోరెంకైటిస్‌’లు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. మధ్యలో ‘టెక్సోరెంకైటిస్‌’ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా. అని అనుకుంటున్నారు కదూ.. ‘ఎలిఫెంట్‌ మస్కిటో’ అసలు పేరు అదే మరి. అయినా నోరు తిరగని ఆ పేరు మనకెందుకు చక్కగా ‘ఏనుగు దోమ’ అని పిలుద్దాం సరేనా! మీకో విషయం తెలుసా.. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దోమ జాతి ఇదే! అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో ఎక్కువగా ఇవి జీవిస్తుంటాయి.

అడవులే ఆవాసం!

ఈ దోమలు మనకు పెద్దగా కనిపించకపోవడానికి కారణం.. ఇవి ప్రధానంగా అడవులే ఆవాసంగా జీవిస్తాయి. ఇవి సుమారు 18 మిల్లీమీటర్ల నుంచి 24 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. వీటిలో చాలా రకాల వల్ల మనుషులకు ఏ ప్రమాదమూ లేదు. మామూలుగా ఆడదోమలు మనుషుల రక్తాన్ని తాగుతాయి కదా! కానీ ఈ ఏనుగు దోమల్లో (చాలా రకాల్లో) ఆడవైనా సరే.. అసలు రక్తాన్ని పీల్చవు. కేవలం మొక్కలు, చెట్ల రసాలను పీల్చే బతుకుతాయి. ఆడదోమలు నీటి ఉపరితలం మీద గుడ్లు పెడతాయి. అందులోంచి కేవలం 40 నుంచి 60 గంటల్లోనే లార్వాలు బయటకు వస్తాయి.

రాత్రి బజ్జుంటాయి..

మనల్ని కుట్టే మిగతా దోమల్లా ఇవి రాత్రిపూట ‘జుయ్‌.. జుయ్‌..’ అంటూ తిరగవు. ఎందుకంటే ఇవి పగలంతా చెట్ల, పువ్వులు, పండ్ల రసాలు తాగుతాయి. రాత్రి కాగానే హాయిగా బజ్జుంటాయి. అంటే మొత్తానికి బుద్ధిమంతులైన దోమలన్నమాట. ప్రస్తుతానికి ఇవే ఫ్రెండ్స్‌ ఈ ఏనుగు దోమ విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని