నా వయసు 270 సంవత్సరాలు!

హాయ్‌ నేస్తాలూ! బాగున్నారా..! నేనో ‘జూ’ను. మామూలు ‘జూ’ను కాదు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దాన్ని. నా వయసు ఏకంగా 270 సంవత్సరాలు. ఇంతకీ నేను ఎక్కడున్నా అంటే..!

Published : 14 Jan 2022 01:01 IST

హాయ్‌ నేస్తాలూ! బాగున్నారా..!
నేనో ‘జూ’ను. మామూలు ‘జూ’ను కాదు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దాన్ని. నా వయసు ఏకంగా 270 సంవత్సరాలు. ఇంతకీ నేను ఎక్కడున్నా అంటే..!

నా పేరు సోహోన్‌బ్రోన్‌. నేను ఉండేది ఆస్ట్రియాలోని వియన్నాలో. నన్ను స్టీఫెన్‌ అనే రాజవంశీయుడు 1752లో ప్రారంభించాడు. ఈయన అప్పట్లో వియన్నాకు కొత్తగా వచ్చారు. ఈయన దగ్గర చాలా పక్షులు, జంతువుల కలెక్షన్‌ ఉండేది. అప్పట్లో రాజవంశీయుల్లో ఇది ఓ అలవాటుగా ఉండేది. ఆయన తన దగ్గర ఉన్న జీవుల కోసం కొన్ని నిర్మాణాలు చేశాడు. వాటిని తన దగ్గర ఉన్న పక్షులు, కోతులవంటి జీవులతో నింపాడు. అప్పట్లో 13 ఎన్‌క్లోజర్స్‌ కట్టాడు. వాటన్నింటి కలయికే సోహోన్‌బ్రోన్‌ అనే నేను.

కష్టాలు.. కన్నీళ్లు..
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నాకు చాలా కష్టమొచ్చి పడింది. నన్ను నమ్ముకుని ఉన్న జంతువులు, పక్షులకు తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది. రోజుకు పదికిలోల వరకు మాంసం తింటోందని అప్పట్లో ఓ ఎలుగుబంటిని కాల్చిచంపేశారు. దానికి తిండిపెట్టలేని పరిస్థితే అసలు కారణం. జూ  కీపర్లు ఇంకా చాలా మాంసాహారజీవులను పోషించలేక చంపేశారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాకు మరింత కష్టమొచ్చింది. 1945 ప్రాంతంలో కేవలం 300 జీవులు మాత్రమే మిగిలాయి. తిండిలేక కొన్ని చనిపోతే. బాంబు దాడుల వల్ల చాలా వరకు మృత్యువాతపడ్డాయి. ఇలా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని ఇప్పటికీ తట్టుకుని నిలబడ్డాను.

యునెస్కో గుర్తింపుతో..
సోహోన్‌బ్రోన్‌కు.. అదే నేస్తాలూ నాకు.. 1996లో ‘యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌’ సైట్‌గా గుర్తింపు దక్కింది. గత 20 సంవత్సరాలుగా నేను ఎంతో అభివృద్ది చెందాను. ప్రస్తుతం.. అంటే కరోనా ముందు వరకు రోజుకు 22 లక్షల మంది నన్ను సందర్శించేవారు.

ఎన్నెన్నో జంతువులు..
ప్రస్తుతం నా దగ్గర 700 జాతులకు చెందిన 8 వేల వరకూ జీవులున్నాయి. నేను ప్రస్తుతం 17 హెక్టార్లలో విస్తరించి ఉన్నా. యూరప్‌ ఖండంలో అత్యుత్తమ జూగా నేను ఇప్పటి వరకు అయిదు సార్లు గుర్తింపు పొందాను. 2008, 2010, 2012, 2014, 2018 సంవత్సరాల్లో నాకు ఈ ఘనత దక్కింది. నేస్తాలూ! మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.. బై..బై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని