పిల్లుల ఇల్లు.. భలే భలే!

హాయ్‌ నేస్తాలూ.. మనకు పెంపుడు జంతువులంటే బోలెడు ఇష్టం కదా! పప్పీలకూ పిచ్చుకలకూ ఇంట్లోనో వరండాలోనో ప్రత్యేకంగా షెల్టర్‌ నిర్మిస్తాం. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా

Updated : 05 Mar 2022 07:51 IST

హాయ్‌ నేస్తాలూ.. మనకు పెంపుడు జంతువులంటే బోలెడు ఇష్టం కదా! పప్పీలకూ పిచ్చుకలకూ ఇంట్లోనో వరండాలోనో ప్రత్యేకంగా షెల్టర్‌ నిర్మిస్తాం. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన ఇంటినే పిల్లుల నివాసానికి అనుకూలంగా మార్చేశాడు. అదెలానో మీరూ చదివేయండి మరి!

కాలిఫోర్నియాకు చెందిన పీటర్‌ కొహెన్‌ అనే వ్యక్తి ఓ కాంట్రాక్టర్‌. కొన్నేళ్ల క్రితం తన సోదరుడితో కలిసి విశాలమైన ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే, అప్పటికే ఆ ఇంట్లో రెండు పిల్లులు నివసిస్తుండటాన్ని పీటర్‌ గమనించాడు. అందులో ఒకటి నల్లది, మరొకటి బూడిద రంగుది. కుటుంబమంతా ఆ ఇంట్లోకి మారాక.. బాగా నచ్చడంతో ఆ రెండు పిల్లులనూ తానే పెంచుకోసాగాడు.

ఆటకు తోడు కావాలని..

ఒకరోజు కారు ఢీకొనడంతో నల్ల పిల్లి ప్రాణాలు కోల్పోయింది. దాంతో బూడిద రంగు పిల్లి ఒంటరిగా ఉంటూ.. ఆహారం సరిగా తినక.. డీలా పడిపోయిందట. అయితే, దాని బాధను పోగొట్టడంతోపాటు కలిసి ఆడుకునేందుకు కొన్ని కొత్త పిల్లులను ఇంటికి తీసుకొచ్చాడు పీటర్‌. అలా ఒక్కోటి ఒక్కోటి కలిసి ప్రస్తుతం ఆ ఇంట్లో మొత్తం 24 పిల్లులు అయ్యాయట.

బోలెడు ఖర్చు చేసి మరీ..

పిల్లుల సంఖ్య ఎక్కువ కావడంతో, అవి ఆడుకునేందుకు తన ఇంట్లో కొన్ని మార్పులు చేయాలనుకున్నాడు పీటర్‌. గతంలో తాను చదివిన ఓ పుస్తకం ఆధారంగా.. కొన్నేళ్లపాటు శ్రమించి.. దాదాపు రూ.75 లక్షలతో ఇంటిని పూర్తిగా పిల్లుల నివాసానికి అనుగుణంగా మార్చేశాడు. 300 అడుగుల క్యాట్‌ వాక్‌ మార్గంతో పాటు 15 అడుగుల టన్నెళ్లూ, 8 వంతెనలూ, అవి తినేందుకూ, గోళ్లతో రక్కేందుకూ ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. పిల్లులు ఎలా ఉండేందుకు ఇష్టపడతాయో ఆ సౌకర్యాలన్నీ కల్పించాడన్నమాట. అంతేకాదు.. టన్నెళ్లన్నీ ఇంట్లోని అన్ని గదులను కలిపేలా నిర్మించాడు. కిందకు దిగకుండా, ఎంచక్కా టన్నెళ్లలోంచే ఒక గది నుంచి మరో గదికి పిల్లులు వెళ్లొచ్చన్నమాట. నిజంగా.. ఈ పిల్లులది ఎంత అదృష్టమో కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని