భలే భలే.. బస్సు బడి!

హాయ్‌.. ఫ్రెండ్స్‌! బాగున్నారా? ఇంతకీ మీకు బస్సు బడి తెలుసా? ‘బస్సులో బడికి వెళ్లడం తెలుసు కానీ.. బస్సు బడి ఏంటబ్బా?’ అని ఆలోచిస్తున్నారు కదూ! ఏం లేదు నేస్తాలూ.. ఓ ప్రభుత్వ

Published : 30 Mar 2022 00:09 IST

హాయ్‌.. ఫ్రెండ్స్‌! బాగున్నారా? ఇంతకీ మీకు బస్సు బడి తెలుసా? ‘బస్సులో బడికి వెళ్లడం తెలుసు కానీ.. బస్సు బడి ఏంటబ్బా?’ అని ఆలోచిస్తున్నారు కదూ! ఏం లేదు నేస్తాలూ.. ఓ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులకు కొరత వచ్చింది. అంతే బస్సే తరగతి గదిలా మారిపోయింది. అదీ ఏదో సాదాసీదాగా కాదు.. ఏకంగా స్మార్ట్‌ క్లాస్‌రూంగా మారింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా మరి.

కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా కుందాపురా తాలుకాలోని బగ్వడీ గ్రామంలో ఓ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. దాదాపు అన్ని ప్రభుత్వ బడుల్లో ఉన్నట్లే ఇక్కడా తరగతి గదులకు కొరత ఉంది. అప్పుడే పూర్వవిద్యార్థి ప్రకాష్‌ ఆచార్‌కు అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాన్ని వెంటనే తన సోదరుడు ప్రశాంత్‌ సాయంతో ఆచరణలో పెట్టేశాడు. ఇంకేం ఎంచక్కా మనలాంటి పిల్లలు హాయిగా బస్సులో కూర్చుని పాఠాలు వింటున్నారు.

మార్గం చూపిన మినియేచర్‌..

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ప్రకాష్‌ కర్ణాటక ఆర్టీసీ బస్సు మినియేచర్‌ ఒకటి తయారు చేశాడు. అంటే.. అచ్చం నిజం బస్సులానే ఉండే నమూనా అన్నమాట. దాన్ని ఆర్టీసీ యాజమాన్యానికి అందించాడు. అదే ఇప్పుడు ప్రకాష్‌కు పనికివచ్చింది! తాను చదువుకున్న బగ్వడీ బడికి వందసంవత్సరాల చరిత్ర ఉంది. దానికోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అప్పుడే పాత ఆర్టీసీ బస్సును తరగతి గదిలా మార్చాలి అనుకున్నాడు. ఇందుకోసం ముందుగా ప్రకాష్‌, ప్రశాంత్‌ సోదరులు రాష్ట్ర రవాణామంత్రిని కలిశారు. తమ ఆలోచన ఏంటో చెప్పారు. ఆయన సహకారం, ఆర్టీసీ యంత్రాంగం ప్రోత్సాహంతో ప్రకాష్‌కు ఓ డొక్కు బస్సు ఉచితంగా లభించింది. అప్పటికే అది తొమ్మిదిలక్షల కిలోమీటర్లకు పైగా తిరిగేసింది.

కలిసి వచ్చిన స్థానికుల సహకారం..

ఆ డొక్కు బస్సును తరగతి గదిలా మార్చడానికి సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చైంది. ఇందుకోసం గ్రామస్థుల సహకారాన్ని కోరాడు. ఊరివాళ్లు సైతం అడిగిన వెంటనే తమవంతు సాయం అందించారు. ఇంకేం తుక్కు కింద తుప్పుపట్టి పోవాల్సిన బస్సు ఎంచక్కా పిల్లలకు తరగతి గదిలా మారింది. అదీ స్మార్ట్‌ క్లాస్‌రూంలా! బస్సు లోపల ఆకర్షణీయంగా రంగులు వేయించారు. ఇందులో ఎల్‌ఈడీ తెర, ఏసీని ఏర్పాటు చేశారు. బస్సు లోపల పిల్లలు కూర్చునేందుకు చిన్న చిన్న బల్లలు, కుర్చీలు వేయించారు. ఇంకేం పిల్లలు ఎంచక్కా ఈ బడి బస్సులో చదువుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అస్సలు డుమ్మాలే కొట్టడం లేదు. మొత్తానికి ఇవీ బస్సు బడి విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని