Published : 04 Apr 2022 01:17 IST

వేలు కన్నా చిన్న.. నాణెం కన్నా తేలిక!

హలో ఫ్రెండ్స్‌... నేను ప్రపంచంలోనే అత్యంత చిన్న ఫోనును. మామూలు ఫోన్‌లో ఉండే అన్ని ఫీచర్లూ నాలోనూ ఉన్నాయి. నేను ఎంత చిన్నగా ఉంటాను అంటే.. కారు కీనే నా కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. మరి నా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారా!

ఇంతకీ మీకు నేను నా పేరు చెప్పనేలేదు కదూ! నన్ను జాన్‌కో టినీ టీ1 అని పిలుస్తారు. నన్ను జినీ మొబైల్స్‌ లిమిటెడ్‌ వాళ్లు తయారు చేశారు. నేను మీ బొటనవేలు కన్నా చిన్నగా ఉంటాను! నాణెం కన్నా తక్కువ బరువుతో ఉంటాను. నేను మీ జీన్స్‌ ప్యాంట్‌కు కుడివైపు జేబుపైన ఉంటే చిన్న ప్యాకెట్‌లోనూ సరిపోతాను.

నా బరువు ఎంతంటే...

నేను కేవలం 46.7 మిల్లీమీటర్ల పొడవు, 21 మిల్లీమీటర్ల వెడల్పు, 12 మిల్లీమీటర్ల మందం ఉంటానంతే. ఇక బరువు కేవలం 13 గ్రాములంతే! అలా అని నేను బొమ్మఫోన్‌నేమీ కాదు. నాకు స్పీకర్‌, నానో సిమ్‌స్లాట్‌, కీ ప్యాడ్‌, మైక్రో యూఎస్‌బీ ఛార్జింగ్‌ పాయింట్‌, మైక్రోఫోన్‌ ఉన్నాయి.

మెసేజ్‌లూ పంపుకోవచ్చు

నాతో కాల్స్‌ మాట్లాడుకోవడమే కాదు.. టెక్ట్స్‌ మెసేజులూ పంపుకోవచ్చు. కాకపోతే నేను కేవలం 2జీ నెట్‌వర్క్‌ సేవలు మాత్రమే అందించగలను. నేను ప్రపంచంలో ఏ దేశంలో అయినా పనిచేయగలను. కానీ ఆస్ట్రేలియా, జపాన్‌లో మాత్రం కుదరదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడో 2జీ సిగ్నళ్లు ఆపేశారంట! ఫ్రెండ్స్‌.. మొత్తానికి ఇవీ నా సంగతులు. 

సరే.. ఇక ఉంటామరి.. ట్రింగ్‌.. ట్రింగ్‌.. ఏంటి అలా చూస్తున్నారు. నా రింగ్‌టోన్‌ భాషలో మీకు బై.. బై.. చెబుతున్నా. ట్రింగ్‌.. ట్రింగ్‌..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు