Updated : 09 Apr 2022 02:53 IST

పప్పీ అంటే ఎంత ప్రేమో..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పెంపుడు జంతువులంటే ఎవరికైనా ఇష్టమే కదా! మనలాంటి పిల్లలకైతే మరీనూ..!! సాయంత్రం బడి అయ్యాక, ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా.. పప్పీతో ఆడుకుందామా అని ఎదురుచూస్తుంటాం! మరి.. ‘అంత ఇష్టంగా పెంచుకునేవి చనిపోతే?’ - కొన్నాళ్లు బాధపడి తర్వాత మర్చిపోతారు. కానీ, ఓ తాతయ్య మాత్రం దాని జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండేలా చేశాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

పెంపుడు జంతువులను చాలామంది కుటుంబ సభ్యుల్లానే భావిస్తుంటారు. వాటిపై ఎనలేని ప్రేమ కురిపిస్తుంటారు. వాటికేమైనా అయితే తల్లడిల్లిపోతారు. తమిళనాడు రాష్ట్రంలోని శివగంగ ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ముత్తు.. తన పెంపుడు కుక్కకు విగ్రహం కట్టించి మరీ అభిమానాన్ని చాటుకున్నాడు.

దశాబ్దానికిపైగా అనుబంధం..

ముత్తు.. 2010 నుంచి ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి ‘టామ్‌ కుమార్‌’ అని పేరు కూడా పెట్టాడు. గతేడాది అది అనారోగ్యానికి గురైంది. ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా.. ఫలితం లేకపోయింది. దాదాపు దశాబ్దానికి పైగా అపురూపంగా, కుటుంబ సభ్యుడిలా చూసుకున్న పప్పీ మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. కొడుకులా చూసుకున్న టామ్‌తో తన అనుబంధాన్ని మాటల్లో చెప్పలేక, ఆ జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండేలా.. నల్లరాయితో ఏకంగా విగ్రహాన్నే కట్టించాడు. దాదాపు లక్షన్నర రూపాయలు వెచ్చించి మరీ తన ఫామ్‌హౌజ్‌లోనే గద్దెలాంటిది నిర్మించి.. దానిపైన విగ్రహాన్ని పెట్టించాడు ముత్తు.

దండలూ, ప్రసాదాలూ..

తమ పూర్వీకులకు కూడా కుక్కలతో చాలా అనుబంధం ఉందనీ, అదే తనకూ అలవాటు అయిందనీ చెబుతున్నాడు ముత్తు. ఇంటి నుంచి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్‌హౌజ్‌కు వారానికి రెండుసార్లు వెళ్తాడట. ప్రస్తుతం ఆ విగ్రహానికి ప్రతిరోజూ పూలమాలలు వేస్తున్నామనీ.. మంగళవారంతోపాటు శుక్రవారం, ఇతర పర్వదినాల సందర్భంగా పప్పీకి ఇష్టమైన ఆహారాన్ని ప్రసాదం మాదిరి చేసి పెడుతున్నారట. అక్కడి కాపాలాదారుతో ప్రతి రోజూ విగ్రహాన్ని కడిగిస్తున్నామనీ, రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఆలయం మాదిరి తీర్చిదిద్దుతామనీ చెబుతున్నాడాయన.

అందరూ వచ్చి చూస్తూ..  

మార్బుల్‌తో పప్పీకి విగ్రహం కట్టించిన విషయం సోషల్‌ మీడియాలో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలూ ప్రత్యేకంగా వచ్చి మరీ టామ్‌ విగ్రహాన్ని చూసి వెళ్తున్నారట. ‘ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుందంటే ఇదే కాబోలు’ అనీ, ‘మూగజీవిపై మీ అభిమానం గొప్పది’ అనీ నెటిజన్లు ముత్తును పొగిడేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు