పడవంత పియానో..!

ఒకటి కాదు.. రెండు కాదు..మూడు కూడా కాదు...ఏకంగా ఇరవై అడుగులు ఇది ఏ చెట్టో.. పుట్టో పొడవు కాదు ఓ పియానో పొడవు... మరి ఆ పే...ద్ద పియానో సంగతులేంటో సరదాగా తెలుసుకుందామా!

Published : 11 Apr 2022 01:08 IST

ఒకటి కాదు.. రెండు కాదు..మూడు కూడా కాదు...ఏకంగా ఇరవై అడుగులు ఇది ఏ చెట్టో.. పుట్టో పొడవు కాదు ఓ పియానో పొడవు... మరి ఆ పే...ద్ద పియానో సంగతులేంటో సరదాగా తెలుసుకుందామా!

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ పియానో పేరు అలెగ్జాండర్‌. ఇది ఇరవై అడుగుల పొడవుతో చిన్నపాటి పడవలా ఉంటుంది. దీని నిర్మాణం 2009లోనే పూర్తైంది. దీన్ని అడ్రియన్‌ మాన్‌ అనే వ్యక్తి న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లోని ఒక స్నేహితుడి వ్యవసాయ షెడ్‌లో నిర్మించాడు. అప్పటికి మాన్‌ వయసు 20 సంవత్సరాలు. అసలు ఇలాంటి ఒక పే...ద్ద పియానో నిర్మించాలనే ఆలోచన మాన్‌కు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వచ్చిందట.

ఇప్పటికీ ఇదే!

నిజానికి పోలాండ్‌లోని డేనియల్‌ తయారు చేసిన ‘స్టోలోమోవి క్లావర్‌’ అనే పియానో అధికారికంగా ‘ది వరల్డ్‌ లార్జెస్ట్‌ పియానో’గా గుర్తింపు పొందింది. కానీ అలెగ్జాండర్‌ పియానో ఇప్పటికీ ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్‌ మాన్యువల్‌ పియానోగా ఉంది.  

తాతయ్యకు ప్రేమతో..

మాన్‌ తాను చాలా కష్టపడి, శబ్దాల మీద ఎన్నో ప్రయోగాలు చేసి తయారు చేసిన ఈ పొడవైన పియానోకు తన తాతయ్య పేరే పెట్టాడు. దీనికి అలెగ్జాండర్‌ అని నామకరణం చేశాడు. ఈ అలెగ్జాండర్‌ పియానో ఇప్పటికీ మాన్‌ దగ్గర ఉంది. మరో విషయం ఏంటంటే.. మన మాన్‌... ‘అలెగ్జాండర్‌ పియానో- 2’ను తయారు చేయబోతున్నాడట. ఇది మొదటి పియానో కన్నా మరింత మెరుగ్గా ఉండబోతుందట. ఫ్రెండ్స్‌ మొత్తానికి ఇవీ అలెగ్జాండర్‌ పియానో విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని