రికార్డుల్లోకెక్కిన పప్పీ!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఇక్కడున్న కుక్కపిల్లను చూస్తుంటే.. బుజ్జిగా భలే ముద్దొస్తుంది కదూ! కానీ, అది బుజ్జిది కాదండోయ్‌.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం.. అంటే ప్రస్తుతం జీవించి ఉన్న కుక్కల్లో ఎక్కువ

Published : 22 Apr 2022 00:58 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఇక్కడున్న కుక్కపిల్లను చూస్తుంటే.. బుజ్జిగా భలే ముద్దొస్తుంది కదూ! కానీ, అది బుజ్జిది కాదండోయ్‌.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకం.. అంటే ప్రస్తుతం జీవించి ఉన్న కుక్కల్లో ఎక్కువ వయసున్నదన్నమాట. అందుకే, గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లోకి చేరిపోయింది. ఆలస్యం చేయకుండా ఈ పప్పీ వివరాలు తెలుసుకుందాం మరి..!

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన గిసెలా అనే మహిళ ఓ జంతు సంరక్షణ కేంద్రంలో వాలంటీర్‌గా పనిచేస్తుండేది. ఒకరోజు ఓ వృద్ధ దంపతులు నెలల వయసున్న చువావా జాతికి చెందిన ఒక కుక్క పిల్లను సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చి.. తాము దాన్ని పెంచలేకపోతున్నట్లు చెప్పి, ఇచ్చేసి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న గిసెలాకు చూడగానే ఆ పప్పీ చాలా నచ్చింది. దాంతో తానే పెంచుకుంటానని చెప్పి ఇంటికి తీసుకెళ్లింది.

రెండు దశాబ్దాల అనుబంధం

వృద్ధ దంపతులు ఆ పప్పీకి ‘పీనట్‌ బటర్‌’ అని పెట్టిన పేరును గిసెలా ‘టోబీకీత్‌’గా మార్చింది. ఇక అప్పటినుంచీ అంటే.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అది ఆమె కుటుంబంతోనే ఉండసాగింది. 2001లో జన్మించిన ఈ కుక్క వయసు ప్రస్తుతం 21 సంవత్సరాల 103 రోజులు. ఇటీవల గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ప్రతినిధులు ఈ కుక్క పిల్లను పరిశీలించి.. ప్రపంచంలోనే బతికి ఉన్న అత్యంత వృద్ధ శునకంగా గుర్తించారు. అంతకుముందు ఈ రికార్డు బ్లూయ్‌ అనే ఆస్ట్రేలియన్‌ జాతి కుక్క పేరిట ఉందట. అది ఏకంగా 29 సంవత్సరాల 5 నెలలు బతికి.. 1939లో చనిపోయిందట.

నిద్రకే ఎక్కువ సమయం

చువావా జాతి కుక్కలు ఎక్కువసేపు నిద్రపోతాయనీ, సాధారణంగా 12 నుంచి 18 ఏళ్లపాటు జీవిస్తాయనీ గిసెలా చెబుతోంది. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు తమ కుటుంబ సభ్యులు దానిపైన చూపించే ప్రేమతోనే టోబీకీత్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుందనేది ఆమె మాట. ఇన్నాళ్లు తమతో పాటే బతికిన పప్పీ.. ఏకంగా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కడంతో ఆ ఇంటి వారంతా సంబరాల్లో మునిగిపోయారట. అంతేకాదు.. అవార్డు రాగానే పప్పీని అందంగా ముస్తాబు చేసి.. విహారయాత్రకు కూడా తీసుకెళ్లారట. గిసెలా వద్ద మరో రెండు కుక్క పిల్లలతోపాటు రెండు రామచిలుకలు కూడా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు