Updated : 04 May 2022 06:58 IST

చేపలూ.. మనతోనే..!

హాయ్‌ నేస్తాలూ.. సాధారణంగా మనం కుక్కపిల్లలనో, పిల్లులనో వాకింగ్‌కు తీసుకెళ్తుంటాం. ‘మరి ఇంట్లో ముద్దుగా పెంచుకుంటున్న చేపలను బయటకు తీసుకెళ్లాలంటే?’.. ‘అలా ఎలా కుదురుతుంది.. బుజ్జి చేపలను ట్యాంకుతో సహా బయటకు పట్టుకెళ్లలేం కదా’ అని అనుకుంటున్నారా! అవును.. అది నిజమే కానీ దానికీ ఒక పరిష్కారం కనిపెట్టాడో వ్యక్తి. అదేంటో తెలుసుకుందాం రండి..

హువాంగ్‌ జియోజీ.. తైవాన్‌ దేశ రాజధాని తైపీకి చెందిన యూట్యూబర్‌. ఇటీవల ఒకరోజు తాను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న మూడు గోల్డ్‌ఫిష్‌లను ఒక తొట్టెలాంటి ట్రాలీలో తీసుకొని వాకింగ్‌కి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
సొంతంగా తయారు చేసి..

కొద్దిరోజుల క్రితం ఎంతో ఇష్టమైన చేపలను ఇంట్లోనే ఒంటరిగా వదిలేయలేక.. తనతోపాటు వాకింగ్‌కు తీసుకెళ్లాలని అనుకున్నాడు హువాంగ్‌. అలాంటి పరికరాల కోసం అక్కడి దుకాణాలు మొత్తం తిరిగినా.. ఎక్కడా దొరకలేదు. అసలు మార్కెట్‌లోనే లేవని తెలుసుకున్నాడు. దాంతో తానే సొంతంగా ఎక్కడికైనా తీసుకెళ్లేలా ఓ అక్వేరియం తయారు చేయాలని అనుకున్నాడు.

బ్యాటరీతో..

మొదట ఓ ఆర్సిలిక్‌ ట్యూబ్‌ను సిద్ధం చేశాడు హువాంగ్‌. అందులో నీళ్లు పోసి.. బ్యాటరీ సహాయంతో ఫిల్టరేషన్‌ అయ్యేలా చూశాడు. చేపలకు ఆక్సిజన్‌ సరఫరా కోసం ఒక గాలిపుంపుతో పాటు ట్యూబ్‌ లోపల వెలుగుల కోసం లైట్లు కూడా ఏర్పాటు చేశాడు. ఈ మొత్తాన్ని హ్యాండిల్‌ ఉన్న ఒక స్టాండ్‌కు అమర్చి.. నడిపేందుకు వీలుగా రూపొందించాడు. ఇటీవల ఈ ‘మొబైల్‌ ఫిష్‌ ట్యాంక్‌’తో వాకింగ్‌కు వెళ్లిన హువాంగ్‌ను చూసి అందరూ నోరెళ్లబెట్టారట. తన ప్రాజెక్టు విజయవంతం కావడంతో.. దానికి మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట. త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నమూ చేస్తున్నాడితను. చేపలనూ ఎంచక్కా మనతోనే బయటకు తీసుకెళ్లే ఈ ఫిష్‌ ట్యాంక్‌ భలే ఉంది కదూ!

కంటైనర్‌ ఫిష్‌ ట్యాంక్‌..

గతేడాది జపాన్‌కు చెందిన ఓ కంపెనీ చేపల కోసం కంటైనర్‌లా ఉండే ఓ బ్యాగ్‌ను తయారు చేసింది. హ్యాండ్‌బ్యాగ్‌ లేదా రేడియో మాదిరి ఉండే దీన్ని చేతితో పట్టుకొని వాకింగ్‌కు తీసుకువెళ్లవచ్చట. అలాగనీ, అల్లాటప్పాగా అని అనుకోకండి ఫ్రెండ్స్‌.. ఈ ట్యాంకుకు.. లోపలున్న నీటిలో ఆక్సిజన్‌ శాతం కొలిచేందుకు ఓ పరికరంతోపాటు ఆహారం అందించేందుకు గొట్టం కూడా ఉంటుంది. ఎన్నో మార్పులు చేర్పుల తరవాత.. ఈ రూపు తీసుకొచ్చినట్లు సదరు సంస్థ చెబుతోంది. బరువు తక్కువ ఉండేలా.. పెద్ద చేపలకూ అనుగుణంగా ఈ ‘కంటైనర్‌ ఫిష్‌ ట్యాంక్‌’కు మెరుగులు దిద్దే పనిలో ఉందా సంస్థ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు