Updated : 11 May 2022 06:02 IST

ఇది పొడవైన భౌ.. భౌ..!

హాయ్‌ నేస్తాలూ.. ఎత్తయిన భవనమనీ, పొడవైన వంతెన అనీ.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా వివిధ అంశాలపైన ప్రతి రోజూ బోలెడు రికార్డులు నమోదవుతుంటాయి. అలాగే, ఓ కుక్క కూడా ఇటీవల గిన్నిస్‌ రికార్డుల్లోకి చేరిపోయింది ఫ్రెండ్స్‌. అదీ రెండేళ్ల వయసులోనే..! ‘కుక్కేంటి?’, ‘రెండేళ్లకే రికార్డేంటి?’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ! అయితే, గబగబా ఈ కథనం చదివేయండి మరి..

అమెరికాలోని టెక్సాస్‌ సమీపంలో బెడ్‌ఫోర్డ్‌ అనే ప్రాంతం ఒకటి ఉంది. అక్కడ నివసించే ఓ శునకం బతికున్న మగ కుక్కల విభాగంలో అత్యంత పొడవైందిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ కుక్క ఏకంగా 3 అడుగుల 5.18 అంగుళాల పొడవు ఉందట.

బంధువు ఇచ్చిన బహుమతి  

బెడ్‌ఫోర్డ్‌కు చెందిన బ్రిటనీ డేవిస్‌ అనే మహిళకు పెంపుడు జీవులంటే చాలా ఇష్టం. ఎప్పటినుంచో ఓ కుక్కపిల్లను పెంచుకోవాలని అనుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువొకరు.. సుమారు ఎనిమిది నెలల వయసున్న గ్రేట్‌ డేన్‌ జాతికి చెందిన ఓ పప్పీని ఆమెకు బహుమతిగా అందించారు. దానికి ఆమె జ్యూస్‌ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకోసాగింది. దీనితోపాటు మరో మూడు పప్పీలూ ఉన్నాయట. కాస్త పొడవైనా.. ఈ జ్యూస్‌ వాటితో బాగా కలిసిపోయి ఆడుకుంటుందట.

పందులంటే భయం!

ఈ క్రమంలో ప్రస్తుతం రెండేళ్ల వయసున్న జ్యూస్‌ ప్రపంచంలోనే ఎత్తైన మగ శునకంగా రికార్డు సాధించింది. సాధారణంగా ఈ జాతి కుక్కలు పొడవు ఎక్కువగా పెరుగుతాయనీ, జ్యూస్‌ పుట్టినప్పటి నుంచే కాస్త పెద్దగా ఉండేదని యజమాని చెబుతోంది. ఈ శునకానికి పందులన్నా, వర్షమన్నా చాలా భయమట. వేగంగా పరిగెత్తటం దీని ప్రత్యేకతల్లో ఒకటనీ, స్థానిక మార్కెట్లలో షికారు చేయడం ఇష్టమనీ ఆమె సంతోషపడిపోతోంది. గతంలో కూడా గ్రేట్‌ డేన్‌ జాతికి చెందిన కుక్క పేరిటే ఈ రికార్డు ఉండేదట. విచిత్రం ఏంటంటే.. దాని పేరు కూడా జ్యూస్‌ కావడమే. కానీ, అది 2014లో మరణించింది. గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కేయడంతో ఈ జ్యూస్‌ చిన్నపాటి సెలబ్రిటీ కూడా అయిపోయిందట. భవిష్యత్తులో ఈ కుక్క ఇంకెంత ఎత్తు ఎదుగుతుందో చూడాలి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు