Updated : 14 May 2022 05:42 IST

చదవొచ్చు.. సినిమాలూ చూడొచ్చు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పుస్తకాల గొప్పతనం గురించీ, పఠనంతో కలిగే ప్రయోజనాలనూ.. బడిలో టీచర్లూ, ఇంట్లో పెద్దవాళ్లూ తరచుగా చెబుతుంటారు. కానీ, అందరికీ గ్రంథాలయ సౌకర్యం ఉండకపోవచ్చు. ఇక మారుమూల ప్రాంతాల్లోని చిన్నారుల గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ పాఠశాలలే సరిగ్గా ఉండవు. అటువంటి పిల్లల కోసమే ఓ అధికారి అన్ని వసతులతో ఒక లైబ్రరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ వివరాలే ఇవీ..

ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మియావో అనే ప్రాంతంలో న్యూ ఏజ్‌ లెర్నింగ్‌ సెంటర్‌(ఎన్‌ఏఎల్‌సీ) పేరిట ఇటీవలే ఓ లైబ్రరీని ప్రారంభించారు. అలాగనీ, అదేదో సాదాసీదాగా అని అనుకోకండి ఫ్రెండ్స్‌.. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్‌ లైబ్రరీ అది.

పేద పిల్లలు చదువుకునేలా..
కొద్దిరోజుల కిందట సన్నీ సింగ్‌ అనే ఓ ఐఏఎస్‌ అధికారి మియావోకి బదిలీపై వచ్చారు. అక్కడి చిన్నారులు చదువుకోకుండా, పనులకు వెళ్లడాన్ని ఆయన గమనించారు. బడుల్లో సరైన వసతులూ లేవని గుర్తించారు. దాంతో ఎలాగైనా పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలనీ, తన కార్యాలయ భవనంలోనే ఒక అంతస్తులో లైబ్రరీని ఏర్పాటు చేయించారు. దాదాపు రూ.30 లక్షలతో ఇందులో ఏసీ, వైఫై, సీసీ కెమెరాలతోపాటు కెఫెల్లో మాదిరి సోఫాలూ, బుక్‌ ర్యాక్‌లనూ పెట్టించారు. ఇళ్లలో చదువుకోవడం వీలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని పేద చిన్నారులూ.. రోజూ సాయంత్రం ఈ లైబ్రరీకి వచ్చి చదువుకోవచ్చు. ఇక్కడ పిల్లలకు అవసరమైన పుస్తకాలతోపాటు నవలలూ, చరిత్ర, విజ్ఞానం తదితర అంశాలవీ అందుబాటులో ఉంచారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఉపయోగకరంగా కొన్ని ట్యాబ్‌లు కూడా సిద్ధం చేశారు.

ప్రతి శుక్రవారం ఒక చిత్రం..
ఈ లైబ్రరీలో కేవలం చదువు మాత్రమే కాకుండా పిల్లలను మానసికంగా ఉత్సాహంగా ఉంచేలా ప్రతి శుక్రవారం ఒక స్ఫూర్తిని రగిలించే సినిమా ప్రదర్శిస్తుంటారు. ఆ వారం ఏ సినిమా వేయబోతున్నారనే వివరాలను సోమవారమే అక్కడి నోటీసు బోర్డులో పెడతారట. పేదవాళ్లకు ఉచితంగా ప్రవేశం కల్పించే ఈ లైబ్రరీలో.. ఇతరులకు మాత్రం రూ.50కే జీవితకాల ప్రవేశం కల్పిస్తున్నారు. మనకు కావాల్సిన పుస్తకం ఇక్కడ లేకపోతే.. ఇంటర్నెట్‌ సహకారంతో ‘ఈ-బుక్‌’ చదువుకోవచ్చు.

విద్యార్థులకు క్విజ్‌ పోటీల నిర్వహణ
చుట్టుపక్కల ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు తమ విద్యార్థులను.. లైబ్రరీ అవర్‌లో ఇక్కడికే తీసుకు వస్తుంటారు. వారికి రెండు వారాలకోసారి క్విజ్‌ పోటీలూ నిర్వహిస్తుంటారు. గెలిచిన పిల్లలకు ప్రత్యేక బహుమతులూ ఇస్తుంటారట. ఈ సరికొత్త గ్రంథాలయాన్ని చూసేందుకు.. పిల్లలతోపాటు పెద్దలూ విపరీతంగా ఆసక్తి చూపుతున్నారట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు