Published : 28 May 2022 01:25 IST

అయ్య బాబోయ్‌.. ఎంత పెద్ద లిఫ్టో!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. లిఫ్టు ఎక్కడమన్నా, దిగడమన్నా మనకు భలే సరదా కదూ! అపార్టుమెంట్లకు వెళ్లినా, ఏదైనా షాపింగ్‌ మాల్‌కి వెళ్లినా.. మన దృష్టి మాత్రం లిఫ్టు ఆట మీదే ఉంటుంది. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం అలాంటిలాంటి లిఫ్టు కాదు. ప్రపంచంలోనే ప్రత్యేకమైంది. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే, చకచకా ఇది చదివేయండి మరి.

మన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్‌ ఎలివేటర్‌ను ఇటీవలే ప్రారంభించారు. సాధారణ లిఫ్టులకు అయితే అయిదారుగురు.. గేటెడ్‌ కమ్యూనిటీలూ, మల్టీప్లెక్సుల్లోని వాటికి అయితే పదిహేను మంది వరకూ తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. వాటన్నింటినీ వెనక్కు నెట్టేసి, బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అతిపెద్ద లిఫ్టులో ఏకంగా 200 మంది వరకూ వెళ్లవచ్చట. అత్యంత బరువైంది కూడా ఇదేనట. ఈ ఎలివేటర్‌ దాదాపు 16 టన్నుల బరువూ, 25.78 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంటుందని తయారీదారులు వెల్లడించారు. మొత్తం 18 పుల్లీలు, 9 దృఢమైన తీగల సహాయంతో ఈ ఎలివేటర్‌ పైకీ, కిందకూ ప్రయాణిస్తుంది.

డిజైన్‌ కూడా ప్రత్యేకమే..
తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ లిఫ్టు అయిదు అంతస్తుల మధ్య రాకపోకలు సాగిస్తుందట. ఈ ఎలివేటర్‌ లోపల కూడా ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారు. బయటి నుంచి లోపలకూ, లోపలి నుంచి బయటకూ కనిపించేలా నాలుగు వైపులా అద్దాలు అమర్చారు. లోటస్‌ థీమ్‌తో పైన భాగాన్ని అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదు.. మన ఇళ్లలో హాల్‌ అంత పెద్దగా ఉండే ఈ లిఫ్టు లోపల రెండు పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. వాటిపైన బిల్డింగ్‌కు సంబంధించిన అంశాలతోపాటు అక్కడ నిర్వహించే కార్యక్రమాల వివరాలూ ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారట. అంతమంది ఒకేసారి ఎక్కితే ఏమౌతుందోననే భయం కూడా అక్కర్లేదట. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో దీన్ని రూపొందించినట్లు తయారీ సంస్థ ప్రతినిధులు ధీమాగా చెబుతున్నారు. ఈ లిఫ్టు వివరాలు చదివాక.. ఫొటోలు చూశాక.. ఏ పని మీదనైనా ముంబయి వెళ్లినప్పుడు కచ్చితంగా అందులో ఆడుకోవాల్సిందే అని అనిపిస్తుంది కదూ! ప్రపంచంలోనే మనుషులను తీసుకెళ్లే అతిపెద్ద ఎలివేటర్‌ మన దేశంలోనే ఉండటం మనందరికీ గర్వకారణమే మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు