ఈ వృక్షం.. మామూలుది కాదు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘ఈ చెట్టు మా తాతల కాలం నాటిది’, ‘మా ముత్తాతల కంటే ముందు తరాలకు చెందిన ఈ వృక్షం ఇప్పటికీ చెక్కుచెదరలేదు’, ‘ఇది మా అమ్మ తన చిన్నప్పుడు నాటిన చెట్టు’ - ఇలాంటి మాటలు మనం తరచూ వింటుంటాం కదా! కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెట్టు వయసును

Published : 29 May 2022 00:32 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘ఈ చెట్టు మా తాతల కాలం నాటిది’, ‘మా ముత్తాతల కంటే ముందు తరాలకు చెందిన ఈ వృక్షం ఇప్పటికీ చెక్కుచెదరలేదు’, ‘ఇది మా అమ్మ తన చిన్నప్పుడు నాటిన చెట్టు’ - ఇలాంటి మాటలు మనం తరచూ వింటుంటాం కదా! కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెట్టు వయసును మాత్రం మనమెవ్వరం అసలు ఊహించలేం కూడా. దాని వివరాలేంటో తెలుసుకోండి మరి.

‘ప్రపంచంలోనే అత్యంత పురాతన వృక్షం ఏదీ?’ అంటే చాలామందికి తెలియక పోవచ్చు. ‘ఎక్కడుంది?’ అంటే ఇకనుంచి అందరూ ‘దక్షిణ చిలీ’ అని జవాబు చెప్పాల్సిందే. ఎందుకంటే, ఎన్నో అధ్యయనాలూ, పరిశోధనల తరవాత ఈ భూమి మీద ఎక్కువ వయసున్న వృక్షం అక్కడే ఉందని శాస్త్రవేత్తలు ఇటీవలే తేల్చారు కాబట్టి!

అయిదువేల ఏళ్లకు పైగానే..

వందేళ్ల నాటి చెట్టు, వెయ్యేళ్ల వృక్షం అని టీచర్లో, పెద్దలో చెబుతుంటారు. దక్షిణ చిలీలోని అటవీ ప్రాంతంలో 5000 సంవత్సరాలకు పైగా వయసున్న ఓ భారీ వృక్షాన్ని ఆ దేశానికి చెందిన జొనాధన్‌ అనే శాస్త్రవేత్త గుర్తించారు. ప్రస్తుతం ఈయన పారిస్‌లోని ఓ లేబొరేటరీలో పనిచేస్తున్నారు. ఈ వృక్షాన్ని ‘పాతగోనియన్‌ సైప్రస్‌’ లేదా ‘అలెర్స్‌ మిలెనరియో’గా పిలుస్తారని చెబుతున్నారాయన. రెడ్‌ వుడ్‌ జాతికే చెందిన ఈ వృక్షాలు దాదాపు 45 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయట.

రకరకాల పద్ధతుల్లో నిర్ధారణ

చెట్టు కాండం లోపల ఉండే వలయాల ఆధారంగా దాని వయసును అంచనా వేస్తుంటారని మీరు పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. తన చిన్నతనంలో ఒకసారి చూసిన ఈ ‘పాతగోనియన్‌ సైప్రస్‌’ వృక్షం వయసునూ కనుక్కోవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. కానీ, తన దగ్గరున్న పరికరాలతో ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఎందుకంటే, ఈ వృక్షం కాండం(మొదలు) దాదాపు నాలుగు మీటర్లు ఉందట. అయినా, ఒక మీటరు వరకూ దాని కాండాన్ని తొలచీ.. శాస్త్రీయంగానూ, ఆధునిక పద్ధతిలోనూ అనేక పరిశోధనలు చేపట్టారు. అన్నింటినీ క్రోడీకరించాక.. 80 శాతం కచ్చితత్వంతో ఈ వృక్షానికి కనీసం 5,484 సంవత్సరాల వయసు ఉంటుందని నిర్ధారించారు.

రికార్డు బద్దలు

ఇప్పటివరకూ అత్యంత పురాతనమైందిగా కాలిఫోర్నియా అడవుల్లోని పైన్‌ వృక్షం పేరిట ఉన్న రికార్డు.. తాజాగా తుడిచిపెట్టుకుపోయింది. దాని వయసు సుమారు 4,853 సంవత్సరాలు. అంటే, దీనికంటే ‘పాతగోనియన్‌ సైప్రస్‌’ వృక్షం దాదాపు 600 ఏళ్లు పెద్దదన్నమాట. వాతావరణ మార్పులూ, వచ్చిపోయే సందర్శకులతో ఈ పురాతన వృక్షానికి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలతోపాటు పర్యావరణవేత్తలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఇవండీ ఈ ‘వయసులో అతిపెద్ద వృక్షం’ వివరాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని