గాల్లో తేలినట్లుందే!

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా.. ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా..? నేనో తీగల వంతెనను. ప్రపంచంలోనే అతిపొడవైన సస్పెన్షన్‌ ఫుట్‌ బ్రిడ్జిని. అంటే నా మీద వాహనాలు నడవవు. నేను పాదచారుల వంతెనను అన్నమాట. ఇంతకీ నా పేరేంటో తెలుసా... ఆశ, దోశ, అప్పడం, వడ.. అన్నీ ఇక్కడే చెప్పేస్తానా.. ఏంటి? మీరే చదువుకోండి. 

Published : 30 May 2022 00:43 IST

హాయ్‌ నేస్తాలూ... బాగున్నారా.. ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా..? నేనో తీగల వంతెనను. ప్రపంచంలోనే అతిపొడవైన సస్పెన్షన్‌ ఫుట్‌ బ్రిడ్జిని. అంటే నా మీద వాహనాలు నడవవు. నేను పాదచారుల వంతెనను అన్నమాట. ఇంతకీ నా పేరేంటో తెలుసా... ఆశ, దోశ, అప్పడం, వడ.. అన్నీ ఇక్కడే చెప్పేస్తానా.. ఏంటి? మీరే చదువుకోండి. 

నా పేరు స్కై బ్రిడ్జి 721. నేను చెక్‌ రిపబ్లిక్‌లోని డోల్నీ మొరావా గ్రామంలో ఉన్నాను. నా పొడవు 721 మీటర్లు. నేను భూమి నుంచి 95 మీటర్ల ఎత్తులో ఉన్నాను. నన్ను ఈ మధ్యే ప్రారంభించారు. ఇంతకు ముందు నా రికార్డు అరౌకా 516 బ్రిడ్జి పేరిట ఉండేది. నేను దాన్ని బద్దలు కొట్టాను. 

పర్వత పుత్రికను..

నేను క్రేలిక్‌ స్నాక్‌ అనే పర్వత శ్రేణుల్లో ఉన్నాను. నేను స్లామ్నిక్‌ పర్వత శిఖరం నుంచి చ్లమ్‌ పర్వత శిఖరం వరకు విస్తరించి ఉన్నాను. నేను ఒక వైపు సముద్ర మట్టానికి 1,125 మీటర్ల ఎత్తు, మరో దిక్కున 1,135 మీటర్ల ఎత్తులో ఉన్నాను. నన్ను నిర్మించడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. 

వెడల్పు తక్కువ..

నా వెడల్పు మాత్రం కేవలం 1.2 మీటర్లు మాత్రమే. అందుకే నా మీద వీల్‌చైర్స్, బైక్‌లు, సైకిళ్లకు అనుమతి లేదు. కేవలం కాలినడకన మాత్రమే అనుమతిస్తారు. మరో విషయం ఏంటంటే.. కుక్కలు, పిల్లులు ఇలా ఏ పెంపుడు జంతువుకు కూడా ప్రవేశం లేదు. 

అద్భుతమే.. పరవశమే..

నా మీద నడుచుకుంటూ వెళితే... అచ్చం గాల్లో తేలినట్లే ఉంటుంది. కాకపోతే నా మీద కాస్త ధైర్యవంతులే నడవగలరు. ఒక్కోసారి ఈ పర్వత శ్రేణుల్లో గాలి గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. అప్పుడు నన్ను వెంటనే మూసి వేస్తారు. పర్యాటకుల భద్రత కోసమే ఇదంతా. నా మీద ఒకసారికి కేవలం 500 మందిని మాత్రమే అనుమతిస్తారు. వాళ్ల సందర్శన పూర్తి అయిన తర్వాత మాత్రమే మరో 500 మందిని అనుమతిస్తారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని