Published : 09 Jun 2022 00:12 IST

శెభాష్‌ సాయి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడో నేస్తం. తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదనుకున్న అతడి పట్టుదలే.. ఇప్పుడు మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రపంచ రికార్డు సాధించేందుకూ అదే బాటలు వేసింది. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, తన ఘనత ఏంటో చదివేయండి మరి..

మహారాష్ట్రలోని పుణెకు చెందిన సాయి తన తండ్రితోపాటు మిత్రులనూ గర్వపడేలా చేశాడు. ఇంతకీ అతడేం సాధించాడంటే.. ఇటీవల ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు చేరుకొని అక్కడ జాతీయ జెండా ఎగురవేశాడు. అంతేకాదు.. అక్కడి నుంచి ఇంకాస్త ఎత్తులో ఉన్న కాలా పత్తర్‌ పర్వత శిఖరాన్నీ అధిరోహించి శెభాష్‌ అనిపించాడు.

పేద కుటుంబమైనా..
పదమూడేళ్ల సాయిది పేద కుటుంబం. తండ్రి చిన్నాచితకా పనులు చేస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం పర్వతారోహణపైన మన సాయికి ఆసక్తి ఏర్పడింది. శిక్షణ తీసుకునేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో తెలిసిన వాళ్లనీ, స్నేహితుల తల్లిదండ్రులనూ సంప్రదించాడు. అలా దాతల సహకారంతో కష్టపడి శిక్షణ తీసుకున్న ఈ బాలుడు.. గత నెల చివరిలో, హిమాలయాల వద్ద ఏటా నిర్వహించే మారథాన్‌లో పాల్గొన్నాడట. అక్కడి ప్రతికూల వాతావారణ పరిస్థితులను ఎదుర్కొంటూ సముద్రమట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్‌ క్యాంపు చేరాడు. అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతం ఆలపించాడు. అక్కడి నుంచి మూడు రోజులపాటు ప్రయాణించి 5,644.5 మీటర్ల ఎత్తులో ఉన్న కాలా పత్తర్‌ పర్వత శిఖరానికి చేరుకున్నాడు. సుమారు 45 దేశాల నుంచి ఔత్సాహికులు పాల్గొన్న ఈ మారథాన్‌లో మన సాయినే చిన్నవాడట.

అదే తన లక్ష్యమట
వచ్చే ఏడాది ఎవరెస్టును అధిరోహించి, అతి పిన్న వయసులోనే ఆ శిఖరానికి చేరుకున్న భారతీయుడిగా రికార్డు నెలకొల్పడమే తన ధ్యేయమని చెబుతున్నాడు సాయి. ఈ నేస్తానికి ఇదే తొలి విజయం కాదు. ఇదివరకే ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌బ్రస్‌ శిఖరాలను అధిరోహించాడు. శిక్షణ తొలినాళ్లలో అక్కడ స్థానికంగా ఉన్న రెండు పర్వతాలనూ అవలీలగా ఎక్కేశాడట. ఆ ఆసక్తిని చూసే.. ఓ ఐపీఎస్‌ అధికారి తనకు మార్గనిర్దేశనం చేసేందుకు ముందుకొచ్చారట. అంతేకాదు.. తాజా ఎవరెస్టు బేస్‌క్యాంపునకు చేరుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్నీ ఆయనే చేశారు. మొత్తం అయిదు రోజుల్లోనే తన సాహసయాత్రను ముగించిన ఈ నేస్తం.. త్వరలోనే ఆస్ట్రేలియా వెళ్లనున్నాడట. అక్కడి పర్వతాల అధిరోహణ అనంతరం వచ్చే ఏడాది ఎవరెస్టు సాహసం చేస్తానని చెబుతున్నాడు.  పట్టుదల, కృషి ఉంటే కలలను సాకారం చేసుకునేందుకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన ఈ నేస్తానికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని