రోబో తేనెటీగలు!

అదో తేనెటీగ.. కానీ తేనెటీగ కాదు! కాస్త తికమకగా ఉంది కదూ!! నిజానికి అది రోబో తేనెటీగ!! తేనెటీగ స్ఫూర్తితో తయారైన రోబో! మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

Updated : 20 Jun 2022 05:20 IST

అదో తేనెటీగ.. కానీ తేనెటీగ కాదు! కాస్త తికమకగా ఉంది కదూ!! నిజానికి అది రోబో తేనెటీగ!! తేనెటీగ స్ఫూర్తితో తయారైన రోబో! మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

హార్వర్డ్‌ యూనివర్సిటీ వారు తేనెటీగల్లాంటి రోబోల తయారీ మీద కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. వీటికి అచ్చం తేనెటీగల్లాగే రెక్కలుంటాయి. ఈ రోబోలు పేపర్‌క్లిప్‌లో సగం పరిమాణమే ఉంటాయి. బరువేమో గ్రాములో పదోవంతు మాత్రమే, అంటే దాదాపు వర్షపు బిందువు అంత బరువు ఉంటాయి. ఇవి సెకనుకు దాదాపు 120 సార్లు రెక్కల్ని ఆడించగలవు. నిజానికి మొదట్లో ఇదే పెద్ద సమస్యగా ఉండేది. దీని వల్ల ఎక్కువ బ్యాటరీ ఖర్చయిపోయేది. ఇవి కేవలం అర సెకను మాత్రమే గాల్లో ఎగరగలిగేవి. కానీ తర్వాత్తర్వాత పరిశోధకులు దీనికి సౌరశక్తిని అనుసంధానించారు. అలాగే మరో జత రెక్కల్ని జత చేశారు. దీనివల్ల సమస్య పరిష్కారమైంది. దీని మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి.

డ్రోన్లు మాత్రమే కాదు..
ఎగురుతాయి కాబట్టి వీటిని కేవలం బుజ్జి డ్రోన్లు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వీటిని ఇవే నియంత్రించుకోగలవు. సెన్సర్ల సాయంతో తమ చుట్టూ ఏమున్నాయో తెలుసుకోగలవు. రికార్డూ చేయగలవు. మీకు మరో విషయం తెలుసా.. ఇవి వాటర్‌ ప్రూఫ్‌. నీటిలోనూ ఎంచక్కా ఇవి ఈదగలవు.

మహా శక్తిమంతం...
మనం చిన్నచిన్న కీటకాలను చాలా చిన్నచూపు చూస్తాం.. కానీ నిజానికి వాటికి చాలా శక్తిమంతమైన కండరాలుంటాయి. వాటి సాయంతోనే రెక్కల్ని ఆడించి అవి గాల్లోకి ఎగురుతాయి. దీని కోసం వాటికి చాలా ఎక్కువ మొత్తంలో శక్తి ఖర్చు అవుతుంది. అలాగే ఈ రోబోబీస్‌కు కూడా పెద్ద మొత్తంలో శక్తి అవసరం. ఈ రోబోబీస్‌లో ఉండే సోలార్‌ సెల్స్‌ దాదాపు 200 వోల్టుల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. రోబో బీస్‌ ఎగరడానికి ఈ శక్తి సరిపోతుంది.

భవిష్యత్తులో..
వీటిలోని సోలార్‌ సెల్స్‌ ఎక్కువ మొత్తంలోనే శక్తిని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ రోబోబీస్‌ను ఇవి అనుకున్నంత ఎక్కువ సేపు గాల్లో ఉంచలేకపోతున్నాయి. బ్యాటరీలను వాడాల్సి వస్తే వాటి బరువు పెరిగి ఎగరడమే కష్టంగా మారొచ్చు. అందుకే ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. రష్యాలాంటి మరి కొన్ని దేశాల వారు సైతం కీటకాల పరిమాణంలో ఉండే ఎగిరే రోబోల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఇవి భవిష్యత్తులో విజయవంతమైతే చాలా ప్రయోజనాలున్నాయి. వ్యవసాయంలో, రక్షణ రంగంలో, ప్రకృతి విపత్తుల సమయంలో, నిఘా కోసం వీటి సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవచ్చు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ రోబో బీస్‌ విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని