Published : 25 Jun 2022 00:36 IST

బడి.. పచ్చని ఒడి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ప్రభుత్వ బడులు అంటే ‘అస్సలు బాగోవు’ అని అనుకుంటారు చాలామంది. కానీ, ఇప్పుడారోజులు పోయాయి. ప్రైవేటుకు ఏమాత్రం తీసిపోకుండా, వాటికి దీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్నిచోట్ల పాఠశాలలను ఓ గార్డెన్‌లా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటిదే..

త్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌ నగరానికి సమీపంలో కీథోట్‌ అనే చిన్న పల్లెటూరు ఒకటి ఉంది. అక్కడి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దాదాపు 300 రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయట. బయటివాళ్లు దాన్ని ఒక స్కూల్‌లా కాకుండా పార్కు అనుకొని పొరబడుతుంటారట.

ప్రధానోపాధ్యాయుడి చొరవ

ఈ స్కూల్‌, పచ్చదనం సంతరించుకొనేందుకు ప్రధానోపాధ్యాయుడు షాహిద్‌ చొరవే ప్రధాన కారణమట. ఆయన ఆ బడికి వచ్చిన కొత్తలో ఆసక్తి మేరకు సొంతంగా మొక్కలు నాటడం ప్రారంభించారు. అది చూసిన గ్రామస్థులు, స్థానిక అధికారులూ ఆయనను ప్రోత్సహించారు. అలా క్రమక్రమంగా ఆ బడిలో చదువుకొనే విద్యార్థులూ పచ్చదనాన్ని పెంపొందించడంలో భాగస్వాములయ్యారు. ఆయన పర్యవేక్షణలో పిల్లలంతా ఉత్సాహంగా మొక్కలు నాటడంతోపాటు వాటి పర్యవేక్షణా చూసుకునేవారట. ఆదివారాలూ, ఇతర సెలవు రోజుల్లోనూ ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు నిత్యం పాఠశాలకు వచ్చి.. మొక్కలకు నీళ్లు పట్టడం, వాటి మొదళ్లను శుభ్రపరచడం చేస్తుండేవారట.

కూరగాయలూ, పండ్లూ.. 

పాఠశాల ఆవరణలోని మొక్కలకు సేంద్రియ ఎరువులు వాడుతూనే మంచి దిగుబడి సాధిస్తున్నారు. వాటిలో కూరగాయలూ, ఆకుకూరలూ, పూలూ, పండ్ల చెట్లే కాకుండా ఆయుర్వేద మొక్కలూ ఉన్నాయట. ఇక్కడ పండిన సామగ్రితోనే పాఠశాలలో నిత్యం మధ్యాహ్న భోజనం వండుతున్నారు. పచ్చదనం కళకళలాడుతుండటంతో రకరకాల పక్షులకూ, కీటకాలకూ ఈ బడి ఆవాసంగా మారుతోంది. అంతేకాదు.. పక్షుల దాహం తీర్చేందుకు, అక్కడక్కడా నీటి తొట్టెలూ ఏర్పాటు చేశారు. వాన నీటిని వృథాగా పోనివ్వకండా.. నిల్వకు ప్రత్యేక పద్ధతులను పాటిస్తున్నారు. ఈ బడి గురించి తెలుసుకొని, చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా పిల్లలను చేర్పిస్తున్నారట. ‘గ్రీన్‌ స్కూల్‌’ విధానాన్ని ఊరిలోనూ అమలు చేయాలని ప్రధానోపాధ్యాయుడిని అక్కడి ప్రజలు కోరుతున్నారట. నిజంగానే ఈ బడి భలే ఆహ్లాదకరంగా ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని