‘చిట్టి’ సహృదయుడు!

వయసు పదకొండు సంవత్సరాలు.. ఈ ఈడు పిల్లలు ఎవరైనా పుస్తకాలతో కుస్తీ పడతారు. కాస్త ఖాళీ సమయం దొరికినా చాలు, ఎంచక్కా ఆడుకుంటారు. కానీ ఓ పిల్లాడు మాత్రం ‘వన్‌ మ్యాన్‌

Published : 03 Jul 2022 01:00 IST

వయసు పదకొండు సంవత్సరాలు.. ఈ ఈడు పిల్లలు ఎవరైనా పుస్తకాలతో కుస్తీ పడతారు. కాస్త ఖాళీ సమయం దొరికినా చాలు, ఎంచక్కా ఆడుకుంటారు. కానీ ఓ పిల్లాడు మాత్రం ‘వన్‌ మ్యాన్‌ షో’లతో ఆకట్టుకుంటున్నాడు. సమాజహితానికి కృషి చేస్తున్నాడు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

కర్ణాటకకు చెందిన గోకుల సహృదయ, ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయాల్లో తన ఏకపాత్రాభినయాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. ఆకలి బాధ, మానవత్వ విలువల్ని ‘చిట్టి’ అనే వన్‌ మ్యాన్‌ షో ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వన్‌మ్యాన్‌ షో నిడివి 65 నిమిషాలు. అంత సమయమూ తానొక్కడే నటిస్తూ.. ప్రేక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా చేస్తున్నాడు. అదే సమయంలో సమాజాన్ని చైతన్యం చేస్తున్నాడు.

ఊరూరా... ప్రదర్శనలు..
బెంగళూరు, మైసూరు, కిట్టుర్‌ ఇలా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 2021 నుంచి ఇప్పటి వరకు 26కు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. దీంతో ఇటీవలే ‘కలాం బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం కూడా సొంతం చేసుకున్నాడు.

నాన్నే ఆదర్శం..
‘చిట్టి’లో తన పాత్రంటే తనకెంతో ఇష్టమంటున్నాడు గోకుల. ఎందుకంటే అది తన నాన్నగారి బాల్యాన్ని గుర్తు చేస్తుందట. ఆయన కూడా తన చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. తనకు నాన్నే ఆదర్శమని, అందుకే ఆ పాత్రంటే చాలా చాలా ఇష్టమని మన గోకుల చెబుతున్నాడు.

‘ఆల్‌రౌండర్‌ అవుతా...’
‘నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు?’ అని అడిగితే.. ‘నేను ముందు మానవత్వం ఉన్న మంచి మనిషిని కావాలనుకుంటున్నా. తర్వాత ఐఏఎస్‌ ఆఫీసర్‌ను అవుతా. థియేటర్‌ ఆర్టిస్టుగానూ పేరు సాధిస్తా. ఇలా నేను ఓ ఆల్‌రౌండర్‌ కావాలని కోరుకుంటున్నా’ అని చెబుతున్నాడు గోకుల సహృదయ. మరింకేం.. ఈ నేస్తానికి మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని