Updated : 01 Aug 2022 12:19 IST

ఓ సారు.. చేశారు సోలారు కారు!

ఆయన ఓ లెక్కల మాస్టారు... సొంతంగా ఓ సోలార్‌ కారు తయారు చేశారు. ఈ కారుకు పెట్రోలు, డీజిల్‌తో పనిలేదు. సూర్యరశ్మి ఉంటే చాలు.. ఎంచక్కా దూసుకుపోతుంది. మరి ఆ కారేంటో... ఆ వివరాలేంటో... తెలుసుకుందామా ఫ్రెండ్స్‌!

శ్రీనగర్‌కు చెందిన బిలాల్‌ అహ్మద్‌ ఓ లెక్కల టీచర్‌. ఈయన జమ్ముకశ్మీర్‌లో మొదటి సోలార్‌ కారును తయారు చేశారు. ఈ కారు చాలా విలాసవంతంగా కనిపిస్తుంది. ఈయన ఈ ప్రాజెక్టు మీద 13 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఓ వైపు విద్యార్థులకు లెక్కల పాఠాలు చెబుతూనే తనకు దొరికిన ఖాళీ సమయాన్ని ఈ కారు తయారీ కోసం వెచ్చించారు. ఇప్పటికి ఆయన ప్రాజెక్టు విజయవంతమైంది. ఆయన దర్జాగా ఈ కారులో శ్రీనగర్‌ వీధుల్లో దూసుకుపోతున్నారు.

బ్యాటరీల సాయంతో....
ఈ కారు పైనంతా సోలార్‌ ప్యానళ్లు అమర్చారు. ఇవే ఈ కారు కదలడానికి మూలం. సోలార్‌ ప్యానళ్లు సూర్యకాంతిని గ్రహించి దాన్ని విద్యుత్‌ శక్తిగా మార్చి బ్యాటరీల్లో నిల్వ చేస్తాయి. ఆ బ్యాటరీలు ఛార్జి అయిన తర్వాత కారు నడవడానికి అవసరమయ్యే శక్తి విడుదలవుతుంది. ప్రస్తుతం తక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీలను వాడటం వల్ల ఈ కారు పల్లె దారుల్లో సరిగా నడవదు. మరింత శక్తిమంతమైన బ్యాటరీలను వాడితే గ్రామీణ ప్రాంతాల్లోనూ దూసుకుపోతుందంటున్నారు బిలాల్‌ సార్‌. కేవలం సోలార్‌ పవర్‌తోనే కాదు.. నేరుగానూ కరెంట్‌తో ఈ కారుకు ఛార్జింగ్‌ పెట్టొచ్చు. కారు నడుస్తున్న సమయంలోనూ సోలార్‌ ప్యానళ్ల సాయంతో బ్యాటరీలు ఛార్జ్‌ అవుతూ ఉంటాయి.

దివ్యాంగుల కోసం అనుకున్నారు...
మొదట్లో బిల్వాల్‌ సార్‌.. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఓ కారు తయారు చేయాలి అనుకున్నారు. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. అంత మొత్తం తాను భరించలేనని ఇదిగో ఈ సోలార్‌ కారు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దీనికీ ఏమంత తక్కువ ఖర్చు కాలేదు నేస్తాలూ.. దాదాపు 50 లక్షల రూపాయల వరకు వెచ్చించారు. ఇంత ఖర్చు కావడానికి కారణం ఏంటంటే.. ఏదైనా వస్తువు కావాలంటే.. ఒక్కటే దొరకదు. లాట్లలో కొనాల్సిందే. అందుకే ఇంత మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ దీన్ని పారిశ్రామికంగా ఉత్పత్తి చేస్తే ఖర్చు భారీగా తగ్గుతుంది అంటున్నారీయన.

రెక్కల తలుపులు...
ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయని పదిహేనేళ్లకు ముందే బిలాల్‌ సార్‌ ఊహించారు. అందుకోసమే ఈ సోలార్‌ కారుకు ప్రాణం పోశారు. కారు పార్కింగ్‌ చేసినప్పుడు తగినంత వెలుతురు దొరకడం కష్టమైంది. అందుకే ఈ కారుకు ఆయన ఫెరారీ కారుకు పైకి తెరుచుకునేలా గల్వింగ్‌ డోర్‌లు తయారు చేశారు. దీంతో వాహనం పార్కింగ్‌ సమయంలోనూ బ్యాటరీలు ఛార్జ్‌ అయ్యే అవకాశం దొరికింది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ లెక్కల సార్‌ తయారు చేసిన సోలార్‌ కారు విశేషాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని