Published : 16 Aug 2022 00:53 IST

ఈ గుడ్డు.. వంద కోట్లలో ఒకటి!

హలో ఫ్రెండ్స్‌.. ‘కోడిగుడ్డు ఎంత ధర ఉంటుంది?’ - అయిదో, పదో.. మహా అయితే ఇరవై రూపాయలో ఉంటుంది. అంతే కదా! కానీ, ఓ కోడిగుడ్డు ధర మాత్రం పదులూ, వందలూ కాకుండా ఏకంగా వేలల్లో పలుకుతోంది. ‘ఏంటి.. నమ్మడం లేదా?’.. అయితే, చకచకా ఈ వివరాలు చదివేయండి.. మీరు కచ్చితంగా నమ్మి తీరుతారు..

యూకేకి చెందిన అనాబెల్‌ అనే మహిళ వీధి కోళ్లను చేరదీస్తూ.. వాటి ఆలనాపాలనా చూస్తుంటుంది. అనేక ఏళ్లుగా ఆమె అదే పనిలో ఉంది. అలా కొన్ని సంవత్సరాల క్రితం తన దగ్గరకు చేరిన ఓ కోడి.. ఇటీవల ఒక గుడ్డు పెట్టింది. ‘కోళ్లు గుడ్లు పెట్టడం, వాటిని పొదగటం మామూలే కదా!’ అని అనుకోకండి ఫ్రెండ్స్‌.. ఆ గుడ్డు అన్ని గుడ్ల మాదిరి అండాకారం(ఓవల్‌)లో కాకుండా గుండ్రంగా ఉందట.

గూగుల్‌లో వెతికితే..

ముద్దుగా ట్విన్‌స్కీ అని పిలుచుకొనే ఆ కోడి పెట్టిన గుండ్రటి గుడ్డును చూడగానే అనాబెల్‌ మొదట ఆశ్చర్యపోయిందట. దాని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని గూగుల్‌లో వెతకడం ప్రారంభించింది. అయితే, ఆ గుడ్డును ‘వన్‌ ఇన్‌ బిలియన్‌’గా తెలుసుకుంది. అంటే.. ప్రతి వంద కోట్ల గుడ్లలో అంలాంటి గుండ్రటిది ఒకటి ఉంటుందన్నమాట. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆ ప్రత్యేక గుడ్డును అస్సలు తినకూడదనుకొనీ, ఓ ఆన్‌లైన్‌ సంస్థలో వేలానికి పెట్టింది. దాని ధరను రూ.48 వేలుగా ప్రకటించింది. ఆ గుడ్డు ఎంత గుండ్రంగా ఉందో తెలిపేందుకు, మామూలు వాటితో కలిపి ఫొటో కూడా తీసింది.

సేవా కార్యక్రమాల విస్తరణకే..

వేలంలో ఆ గుడ్డును దక్కించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని అనాబెల్‌ చెబుతోంది. ప్రకటించిన ధర కంటే అధికంగా ఇస్తామనీ కొందరు ముందుకొస్తున్నారట. వేలం ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకే వెచ్చిస్తానంటోందామె. రోడ్ల మీద తిరిగే మరిన్ని మూగ జీవాలకు వసతి కల్పిస్తుందట. అయితే, ఈ మహిళకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వారు కూడా తల్లి స్ఫూర్తితో వివిధ రకాల పక్షులనూ, జీవులనూ పెంచుతున్నారట. ‘ఇటువంటి గుండ్రని గుడ్డును ఇంతవరకూ చాలామంది చూసే ఉండరు. మా పెరట్లోని కోడి పెట్టిన గుడ్డు బంతి మాదిరి దొర్లుతుంది కూడా. కోళ్లన్నీ చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి. ట్విన్‌స్కీ అయితే నా చుట్టూనే తిరుగుతుంటుంది. అందుకే, కొన్నిసార్లు దాన్ని ‘లాబ్రాడర్‌’ అని కుక్క జాతి పేరుతో పిలుస్తుంటా’ అని అనాబెల్‌ చెబుతోంది. నిజంగా ఇక్కడి ఫొటోల్లోని గుండ్రటి గుడ్డు భలే ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని