గిరగిరా.. చిన్ని చిన్ని గిరగిరా!

చిన్ని.. చిన్ని.. గిరగిరా... బుజ్జి.. బుజ్జి.. గిరగిరా..  ఇది చాలా చిన్న గిరగిరా.. ఎంత చిన్న గిరగిరా అంటే...  ప్రపంచం మొత్తంలోకెల్లా  అతి చిన్న గిరగిరా...!  మరి దాని గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్‌...

Published : 24 Aug 2022 00:19 IST

చిన్ని.. చిన్ని.. గిరగిరా... బుజ్జి.. బుజ్జి.. గిరగిరా..  ఇది చాలా చిన్న గిరగిరా.. ఎంత చిన్న గిరగిరా అంటే...  ప్రపంచం మొత్తంలోకెల్లా  అతి చిన్న గిరగిరా...!  మరి దాని గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్‌...

నేస్తాలూ... మీకు ఫిడ్‌జెట్‌ స్పిన్నర్‌ గురించి తెలిసే ఉంటుంది కదా..! మనకు బోర్‌ కొట్టినప్పుడు, కాలక్షేపం కోసం అప్పుడప్పుడు దీన్ని గిరగిరా తిప్పుతూ ఆడుకుంటూ ఉంటాం కదూ! అయితే ప్రపంచంలోకెల్లా అతిచిన్న ఫిడ్‌జెట్‌ స్పిన్నర్‌ను జపాన్‌ వాళ్లు తయారు చేశారు.

ఆలోచనకు రూపం..
జనాల చేతుల్లో.. ముఖ్యంగా పిల్లల చేతుల్లో గింగిరాలు తిరుగుతున్న ఈ ఫిడ్‌జెట్‌ స్పిన్నర్‌ను అతి చిన్నగా తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఓ జపాన్‌ కంపెనీకి వచ్చింది. వచ్చిన వెంటనే వారు దాన్ని అమల్లో పెట్టారు. దాని ప్రతిఫలమే.. ప్రపంచంలోకెల్లా అతిచిన్న ఫిడ్‌జెట్‌ స్పిన్నర్‌.

మునివేలిపై...
ఈ ఫిడ్‌జెట్‌ స్పిన్నర్‌ను మునివేలు మీదే తిప్పేయొచ్చు. ఇది కేవలం 5.09 మి.మీ మాత్రమే ఉంది. బరువు ఎంత ఉంటుందో తెలుసా.. కేవలం 0.027 గ్రాములంతే! అంటే అర్థం చేసుకోండి.. ఎంత చిన్న స్పిన్నరో ఇది. అందుకే దీనికి ప్రపంచంలోకెల్లా అతిచిన్న ఫిడ్‌జెట్‌ స్పిన్నర్‌గా గిన్నిస్‌ రికార్డ్‌ దక్కింది.

రెండు నెలలకు పైనే...
దీన్ని చిన్న స్పిన్నర్‌ అని తేలిగ్గా తీసుకోకండి. దీని తయారీకి రెండునెలలకు పైగా సమయం పట్టింది. పైగా ఎనిమిది మందితో కూడిన బృందం ఈ ప్రాజెక్టు మీద పనిచేసింది. అప్పటికి కానీ ఈ బుజ్జి ఫిడ్‌జెట్‌ స్పిన్నర్‌ సిద్ధం కాలేదు మరి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ బుజ్జి గిరగిరా విశేషాలు.


గింగిరాలే.. గింగిరాలు..

ప్రపంచంలోకెల్లా చిన్న స్పిన్నరే కాదండోయ్‌.. ఎక్కువసార్లు గిరగిరా తిరిగిన స్పిన్నర్‌ కూడా ఒకటి ఉంది. దీన్ని కూడా జపాన్‌వాళ్లే తయారు చేశారు. ఈ ఫిడ్‌జెట్‌ స్పిన్నర్‌ ఏకంగా 24 నిమిషాల 46.34 సెకన్ల పాటు తిరిగింది. గిన్నిస్‌ రికార్డునూ సొంతం చేసుకుంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని