చిట్టి జెట్‌.. వేగంలో గ్రేట్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏంటి అలా చూస్తున్నారు. విమానం ఏంటి.. ఇంత బుజ్జిబుజ్జిగా ఉందనా? నేను ప్రపంచంలోకెల్లా అతిచిన్న జెట్‌ను మరి. నా గురించి విశేషాలు తెలుసుకోవాలని ఉంది

Updated : 26 Aug 2022 04:24 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏంటి అలా చూస్తున్నారు. విమానం ఏంటి.. ఇంత బుజ్జిబుజ్జిగా ఉందనా? నేను ప్రపంచంలోకెల్లా అతిచిన్న జెట్‌ను మరి. నా గురించి విశేషాలు తెలుసుకోవాలని ఉంది కదూ...! కానీ ముందు మీరు మా తాతగారి గురించి తెలుసుకోవాలి. తర్వాతే నా గురించి మీకు తెలుస్తుంది. అయితే ఇంకెందుకాలస్యం... ఈ కథనం చదివేయండి.

అమెరికాకు చెందిన జిమ్‌ బేడ్‌ అనే వ్యక్తి మాతాత గారిని 1970లో తయారు చేశాడు. మా తాతకు బీడీ-5 అనే పేరు పెట్టాడు. మా తాత మొదటి సారి సెప్టెంబర్‌ 12, 1971లో గాల్లో ఎగిరారు. కొన్ని సంవత్సరాల వరకు ప్రపంచంలోనే అతి చిన్న జెట్‌ రికార్డు మా తాతగారైన బీడీ-5 పేరిటే ఉండేది. ఇక నా విషయానికొస్తే... బీడీ-5 కిట్తోనే జాన్‌ జిమెన్‌జ్‌ అనే వ్యక్తి నన్ను తయారు చేశాడు. నాకు బీడీ-5జే అనే పేరు పెట్టాడు.

బరువు తక్కువే!
ఇంతకీ మీకు నా బరువెంతో చెప్పనే లేదు కదూ! కేవలం 162.7 కిలోలు మాత్రమే. అంటే ఓ మోస్తరు బైక్‌ బరువుకన్నా తక్కువే అన్నమాట. పొడవు సుమారు 12 అడుగులు. రెక్కల వెడల్పేమో సుమారు 17 అడుగులు. నిజానికి బీడీ సిరీస్‌లో చాలా విమానాలే ఉన్నాయి. అవన్నీ బుజ్జి బుజ్జివే. కానీ అందులో నేనే అతి చిన్నదాన్ని. అందుకే నా పేరు ప్రపంచంలోనే అతిచిన్న జెట్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. అంటే నేను మా తాతగారి రికార్డునే బ్రేక్‌ చేశానన్నమాట. మీకు మరో విషయం తెలుసా... నేను రెండు జేమ్స్‌బాండ్‌ సినిమాల్లోనూ కనిపిస్తాను.


‘పిట్ట కొంచెం..

‘పిట్ట కొంచెం.. కూత ఘనం...’ అన్నట్లు నేను చాలా వేగంగా దూసుకుపోగలను. గంటకు 483 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలను. వేగంలో నాకు సాటి లేదు కానీ.. నాలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించగలరు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు.. ఇక ఉంటా మరి.. మీరూ చకచకా తయారై స్కూలుకు వెళ్లండి సరేనా.. బై.. బై..!



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు