Updated : 06 Sep 2022 05:33 IST

కూ.. బుజ్జి బుజ్జి.. చుక్‌.. చుక్‌..!

హాయ్‌ ఫ్రెండ్స్‌... అదో మ్యూజియం. ‘ఆ.. ఏముందిలే.. ఎన్నో మ్యూజియాలున్నాయిగా.. దీని ప్రత్యేకత ఏంటో?’ అని అనుకుంటున్నారు కదూ! ఇది బుజ్జి మ్యూజియం. అవును ఇదో మినియేచర్‌ మ్యూజియం. ఇందులో అన్నీ బుజ్జి బుజ్జి రైళ్లు కూ.. చుక్‌.. చుక్‌.. అంటూ పరుగులు పెడుతుంటాయి. మరి ఆ మ్యూజియం ఎక్కడుంది? దాని సంగతులేంటో తెలుసుకుందామా!

మ్యూజియంలో అడుగు పెట్టగానే అద్భుతాలు కనువిందు చేస్తాయి. జేబులో పట్టే సైజులో ఉండే స్టీమ్‌ ఇంజిన్లు, చిన్ని చిన్ని ఫ్లై ఓవర్లు, స్విమ్మింగ్‌ పూల్‌, చిన్ని సర్కస్‌ పలకరిస్తాయి. ఇవన్నీ మహారాష్ట్రలోని పుణె సమీపంలోని కోత్రూడ్‌లో ఉన్న సౌధామిని ఇన్‌స్ట్రుమెంట్స్‌ పరిశ్రమ హాలులో కనిపిస్తాయి. దీన్ని ‘జోషీస్‌ మ్యూజియం ఆఫ్‌ మినియేచర్‌ రైల్వేస్‌’ అని పిలుస్తారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న ఏకైక మినియేచర్‌ సిటీ ఇదే. అందుకే ఇది 2004 సంవత్సరంలోనే ‘లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కింది.

ఎప్పుడు ప్రారంభమైందంటే..

ఈ బుజ్జి మ్యూజియం 1998లోనే ప్రారంభమైంది. దీన్ని బి.ఎస్‌.జోషి అనే తాతయ్య తయారు చేశారు. ఆయనకు చిన్నప్పటి నుంచే రైళ్లంటే చాలా ఇష్టం. అందుకే చాలా చిన్న చిన్న రైళ్ల నమూనాలు సేకరించేవాడు. కొన్నైతే కార్డుబోర్డుతో తానే సొంతంగా తయారు చేసేవాడు. కేవలం రైళ్లే కాకుండా.. చిన్న చిన్న లే అవుట్లలో అడవులు, చారిత్రక కట్టడాల నమూనాలు, కార్లు, ఫైర్‌ ఇంజిన్లు ఇలా ఓ నగరంలో ఏమైతే ఉంటాయో వాటన్నింటి నమూనాలూ తయారు చేసేవాడు. ఈ తాతయ్య పెద్దవాడయ్యాక కూడా ఈ పనిమీద ఆసక్తి తగ్గలేదు. అందుకే 1980 ప్రాంతంలో ఈ బుజ్జి మ్యూజియానికి అంకురార్పణ జరిగింది. దీనికి సంబంధించిన లే అవుట్‌ను మొదటిసారిగా గోఖలే హాల్‌లో 1982లో ప్రదర్శనకు పెట్టాడు. నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ దస్తూర్‌ హైస్కూల్‌లో ప్రదర్శించాడు.

శాశ్వతంగా ఉండాలని..

ఇక ఇలా కాదని ఏదైనా ఒకేచోట శాశ్వత మినియేచర్‌ రైల్వే మ్యూజియం నిర్మించాలనుకున్నాడు. 1991లో సౌధామిని ఇన్‌స్ట్రుమెంట్స్‌ పరిశ్రమ హాల్లో నిర్మాణం ప్రారంభించాడు. ఏడు సంవత్సరాల కఠోర శ్రమ తర్వాత 1998 ఏప్రిల్‌ 1న ‘జోషీస్‌ మ్యూజియం ఆఫ్‌ మినియేచర్‌ రైల్వేస్‌’ ప్రారంభమైంది.

వేల సంఖ్యలోనే...

ఇప్పుడు ఈ మ్యూజియం ఆలనాపాలనా జోషితాత కుమారుడు రవిజోషి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మ్యూజియంలో 1000కు పైగా వైర్లతో కూడిన కంట్రోల్‌ ప్యానెల్‌ ఉంది. 65 సిగ్నళ్లు, పెద్ద సంఖ్యలో రైళ్లు, ల్యాంప్‌ పోస్ట్‌లు, ఫ్లైఓవర్లున్నాయి. ప్రతి సంవత్సరం 30,000లకు పై చిలుకు సందర్శకులు ఈ బుజ్జి మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు.

నిజంగా మరో ప్రపంచం!

మామూలుగా మ్యూజియం అంటే వస్తువులు కదలకుండా ఓ చోట ఉంటాయి. కానీ ఈ మ్యూజియంలో రైళ్లు నిత్యం నడుస్తూ ఉంటాయి. ఈ రైళ్లలో ఆవిరి ఇంజిన్లు, డీజిల్‌ ఇంజిన్లతో పాటు ఎలక్ట్రిక్‌ హైస్పీడ్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఉన్నాయి. అంతే కాదు నేస్తాలూ.. అండర్‌ గ్రౌండ్‌ మెట్రో, రోప్‌ రైల్వే వ్యవస్థలూ ఉన్నాయి.

కార్లూ ఉన్నాయోచ్‌...

కేవలం రైళ్లు, ప్లాట్‌ఫారాల కాదు.. హైవే, దాని మీద పరుగులు పెట్టే బుజ్జి కార్లూ ఉన్నాయి. ఇంకా భవంతులు, దీపాల వెలుగులు ఇలా ఒక్కటేంటి.. నిజంగా ఓ నగరంలానే ఉంటుంది.


మనుషుల బొమ్మలూ...

బుజ్జి మ్యూజియంలో రైళ్లు, కార్లు, భవంతులే కాకుండా జనాలూ ఉన్నారు తెలుసా. అంటే నిజమైన మనుషులు కాదనుకోండి. మనుషుల బొమ్మలు అన్నమాట. వాటన్నింటినీ లెక్కిస్తే దాదాపు 2,000 పై చిలుకే ఉంటాయట.
నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మినియేచర్‌ రైల్వే మ్యూజియం సంగతులు. భలేగా ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని