Published : 07 Sep 2022 00:18 IST

దోమలకు ఎర.. ఆలోచన భళా!

హలో ఫ్రెండ్స్‌.. దోమల వల్ల అనేక వ్యాధులు వ్యాపిస్తాయని మీరు పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాటి వ్యాప్తిని మాత్రం అంతగా అరికట్టలేకపోతున్నాం. అందుకే, ఓ చిన్నారి తక్కువ ఖర్చులో దోమల నివారణకు ఓ ఆవిష్కరణ చేసింది. మరి.. అదేంటో తెలుసుకుందాం రండి..

ఇందిరా అర్జున్‌.. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి చెందిన ఈ బాలికకు 11 సంవత్సరాలు. లాక్‌డౌన్‌లో అన్నీ మూతబడటంతో అందరిలాగానే ఇందిర కూడా ఇంటికే పరిమితమైంది. కానీ, దొరికిన ఆ ఖాళీ సమయాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోవాలని అనుకుంది. నాయనమ్మతో కలిసి చిన్న చిన్న సైన్స్‌ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. క్రమంగా ఆ ఆసక్తి పెరగడంతో.. పాఠశాలలు ప్రారంభించిన తర్వాత కూడా రకరకాల ప్రయోగాలు చేయసాగింది.

నిరుపయోగ వస్తువులతో..
దోమల వల్ల ఏటా కొన్ని వందల మంది మరణిస్తున్నారని టీవీల్లో చూసి తెలుసుకున్న ఇందిర.. వాటి నివారణకు తనవంతు ఏదో ఒక ప్రయత్నం చేయాలని అనుకుంది. కెనడాలోని ఓ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ఓ నమూనాను ఆధారంగా తీసుకుంది. ఆ ప్రయోగం జికా, డెంగీ వ్యాప్తి చేసే దోమల సంఖ్యను గణనీయంగా కట్టడి చేయడంతో.. తాను కూడా అలాంటిదే రూపొందించాలని అనుకుంది. వెంటనే బయాలజీ టీచర్‌ అయిన నాయనమ్మ సహకారం కోరింది. ఇంట్లో వృథాగా పడి ఉన్న రబ్బరు టైరు, పైపు ముక్క, ఫిల్టర్‌ పేపర్లు, గమ్‌ తదితర పరికరాలతో పని ప్రారంభించింది.

లార్వాను విచ్ఛిన్నం చేసి..
టైర్‌ను సగానికి కోసి.. దాన్ని గోడకో, కర్రకో వేలాడదీయాలి. మధ్యలో రంధ్రం చేసి.. పైపు ఒక కొనను అంటించాలి. మరో కొనను వాల్వులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ టైరులో ముప్పావు భాగం నీళ్లు పోసి, రెండువైపులా ఫిల్టర్‌ పేపర్లు ఉంచాలి. ఆ పేపర్లే దోమల్ని ఆకర్షిస్తాయన్నమాట. అలా మూడు రోజులు ఆగిన తర్వాత.. ఆ నీటిని పైపు సహాయంతో ఓ పాత్రలోకి వడగట్టాలి. ఆ వడపోసిన వస్త్రం పైభాగంలో లార్వా ఉంటుంది. దాన్ని క్లోరిన్‌ నీటిలో వేస్తే లార్వా చనిపోయి.. దోమల సంఖ్య పెరగకుండా ఉంటుంది. వడపోసిన ఆ నీటికి దోమలను ఆకర్షించే తత్వం ఉండటంతో, మళ్లీ టైర్‌లో పోయవచ్చు. అలా ఓ అయిదారుసార్లు అదే నీటిని మళ్లీ వినియోగించుకోవచ్చు.

ప్రధాని నుంచి అభినందన
ఇలాంటి పరికరాలు రెండు ఏర్పాటు చేస్తే.. దాదాపు ఒక ఎకరం స్థలంలో దోమలను అరికట్టవచ్చని చెబుతోంది ఇందిర.

ఈ ప్రయోగం పనితీరు బాగుండటంతో అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వచ్చి పరిశీలించారట. అంతే కాదు.. ఇతర ప్రాంతాల్లో ఈ నమూనాను అమలు చేసే ప్రయత్నాలూ ప్రారంభించారట. గతంలో ఈ బాలిక.. సాంకేతికత సహాయంతో పిల్లలకు జంతువుల గురించి అర్థమయ్యేలా చెప్పేందుకు చిన్న చిన్న వీడియోలూ రూపొందించిందట. అవి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన ఇందిరను అభినందించారు. ఇంత చిన్న వయసులో ఈ నేస్తం ప్రతిభ నిజంగా గ్రేట్‌ కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని