Updated : 18 Sep 2022 00:54 IST

భౌ... భౌ.. డాగథాన్‌!

హాయ్‌ నేస్తాలూ! మీరు ఎప్పుడైనా డాగథాన్‌ అనే పదాన్ని విన్నారా? ‘మారథాన్‌ అంటే తెలుసు... మరి డాగథాన్‌ అంటే ఏంటి’ అని ఆలోచిస్తున్నారు కదూ! ఈ కథనం చదవండి. మీకే తెలుస్తుంది.

చెన్నై, బెంగళూరు, దిల్లీ, ముంబయి, గుర్‌గ్రామ్‌, చండీగఢ్‌, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌ ఈ తొమ్మిది నగరాల్లో ఏకకాలంలో జరిగే మూడు కిలోమీటర్ల నడకే ఈ డాగథాన్‌. ఇందులో శునకాలు తమ యజమానులతోపాటుగా పాల్గొంటాయి. ఇది ఏటా జరుగుతోంది. ఈ సంవత్సరమూ జరగబోతోంది. ఈ డాగథాన్‌ను ‘హెడ్స్‌ అప్‌ ఫర్‌ టైల్స్‌’ అనే సంస్థ మరికొన్ని సంస్థలతో కలిసి నిర్వహిస్తోంది. జంతువుల సంక్షేమానికి కావాల్సిన నిధులనూ ఈ సందర్భంగా సేకరిస్తున్నారు.

మంచి పని కోసం...

షెడ్యూలు ప్రకారం ఈ రోజు ఉదయం 7 గంటలకు పైన తెలిపిన తొమ్మిది నగరాల్లో ఈ డాగథాన్‌ ప్రారంభమవుతుంది. రెండున్నర గంటలపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మొట్టమొదటగా ఈ ఈవెంట్‌ను 2018లో ప్రారంభించారు. జంతు ప్రేమికులందరినీ ఓ చోట చేర్చడం కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రారంభంలో నిధుల సేకరణ గురించి ఆలోచించలేదు కానీ, జంతువుల కోసం ఏదైనా మంచి పని చేయాలన్న ఆలోచన వచ్చి తర్వాత అమల్లోకి తీసుకొచ్చారు. మొదట ఈ కార్యక్రమం బెంగళూరులో ఓ చిన్న ఈవెంట్‌లా ఊపిరిపోసుకుంది. కేవలం 40 నుంచి 50 మంది మాత్రమే జంతుప్రేమికులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య భారీగా పెరిగింది.

మూగజీవాల కోసం...

ఇలా సేకరించిన నిధులను మూగజీవులకు ఆశ్రయం కల్పించడం, ఆహారం అందించడం కోసం వెచ్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే పెంపుడు జీవుల కోసం కూడా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. పెంపుడు జంతువుల దాహం తీర్చేందుకు ఎక్కడికక్కడ నీటిపాత్రలు పెట్టారు. వాటికి ఏమైనా అనారోగ్య సమస్యలొస్తే చికిత్స చేసేందుకు వైద్యులనూ నియమించారు. వాహనాల వల్ల ఇబ్బందులు పడకుండా కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ డాగథాన్‌లో గెలిచిన శునకాలకు బహుమతులూ ఉన్నాయి. పాల్గొన్న వాటికి సర్టిఫికెట్లూ అందివ్వనున్నారు. ఈ డాగథాన్‌లో పాల్గొనాలని ఉంటే, పెంపుడు జంతువు లేకపోయినా ఫర్వాలేదు. చక్కగా ఇందులో ఎవరైనా భాగస్వాములు కావొచ్చని చెబుతున్నారు నిర్వాహకులు. ఒక మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ డాగథాన్‌ నిజంగా గ్రేట్‌ కదూ! మరి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనమూ మనసారా కోరుకుందామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని